Revanth Reddy | 42 శాతం రిజర్వేషన్లు ఆమోదిస్తారా? గద్దె దింపాలా? : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy | తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తారా? లేకపోతే మిమ్మల్ని గద్దె దించాలా అని ప్రధాని మోదీ, ఎన్‌డీ‌ఏకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

మా ఆలోచనలను, బిల్లులను తుంగలో తొక్కే అధికారమెక్కడిది
బిల్లులు పంపి 4 నెలలైనా రాష్ట్రపతి ఆమోదం పొందలేదు
మోదీ మెడలు వంచి 42% బీసీ రిజర్వేషన్లను సాధిస్తాం
తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డి, సంజయ్‌లకు అవసరం లేదా
కేసీఆర్ ఇంట్లో బీసీలకు ఒకరు అనుకూలం..మరొకరు వ్యతిరేకం
జంతర్ మంతర్ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

Revanth Reddy | విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తారా? లేకపోతే మిమ్మల్ని గద్దె దించాలా అని ప్రధాని మోదీ, ఎన్‌డీ‌ఏకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీసీలకు న్యాయం చేసే ఆలోచన మోదీకి లేదని, అందుకే ఆయన మన బద్ద శత్రువని రేవంత్ రెడ్డి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు ఆమోదించాలని కోరుతూ బుధవారం న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల కోసం రూ. 4 కోట్ల మంది ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారన్నారు. తమ ఆలోచనలు, బిల్లులను తుంగలో తొక్కే అధికారం ఎవరిచ్చారని కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, రామచందర్ రావు, బండి సంజయ్ కు ఏమైందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో మీరు బీసీల ఓట్లు అడగరా? తెలంగాణ ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా? అని ప్రశ్నించారు. పేరు బంధం తెగిన టీఆర్ఎస్‌కు తెలంగాణతో పేగు బంధం కూడా తెగిందా అని ప్రశ్నించారు. తమ దీక్షను డ్రామా అని కేటీఆర్ చేసిన విమర్శలను రేవంత్ ప్రస్తావిస్తూ ఆయన ఇంట్లోనే డ్రామా నడుస్తోందని పరోక్షంగా కవిత అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కేటీఆర్ పేరే డ్రామారావు అంటూ ఆయన మండిపడ్డారు.. కేసీఆర్ ఇంట్లోనే ఒకరు బీసీలకు అనుకూలమంటారు. మరొకరు వ్యతిరేకం అని చెప్పుకుంటారని ఆయన అన్నారు.

2029 ఎన్నికల్లో మోదీని ఓడించి రాహుల్‌ను ప్రధానిని చేస్తాం

75 ఏళ్ల నిబంధన మోదీకి వర్తించదా… ఆయన పదవి నుంచి దిగినా దిగకపోయినా.. 2029 ఎన్నికల్లో ఆయనను ఓడించి రాహుల్ ను ప్రధానిని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్ల కంటే ఎక్కువ రాకుండా అడ్డుకుంటామన్నారు. బీసీలపై కక్షతో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలని కేసీఆర్ చట్టం చేశారని ఆయన ఆరోపించారు. కొత్త చట్టం చేయాలంటే 2018లో కేసీఆర్ చేసిన చట్టం గుదిబండగా మారిందని ఆయన విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ ఆర్డినెన్స్ కు గవర్నర్ కు పంపామని ఆయన చెప్పారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తూ చేసిన ఆర్డినెన్స్ కేంద్రం వద్ద ఉందన్నారు. బిల్లులు పంపి 4 నెలలైనా రాష్ట్రపతి ఆమోదం పొందలేదని ఆయన అన్నారు. ఈ బిల్లులను మోదీ, బీజేపీ బిల్లులను అడ్డుకొని బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందామని ఛలో ఢిల్లీ చేపట్టామని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ధర్నాకు వంద మంది ఎంపీలు, ఇండియా కూటమి పార్టీలు మద్దతిచ్చాయని చెప్పారు. తెలంగాణలో దీక్ష చేస్తే కేవలం రాష్ట్రంలోని పార్టీల మద్దతు మాత్రమే ఉంటుందని ఢిల్లీలో ధర్నా చేస్తున్నామన్నారు. మోదీ మెడలు వంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్రపతి వద్ద ఆగిపోయిన బిల్లును సాధించుకోవాలి

వందేళ్లుగా ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కులగణన చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 70 ఏళ్లలో 300 మంది సీఎంలు చేయని సాహసం చేయడంతో దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తనకు వచ్చిందని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ సందేశంతోనే జనగణనలో కులగణన చేపట్టామని ఆయన తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చట్టం చేసి డిల్లీకి సవాల్ విసిరామన్నారు. రిజర్వేషన్లకు అడ్డుపడిన కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పైనే కాదు.. ఢిల్లీ, మోదీ మీద భారత ప్రభుత్వానికి కూడా సవాల్ విసురుతున్నట్టు ఆయన చెప్పారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. కులగణన కోసం రాష్ట్రంలో సమగ్ర సర్వే చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక్క పార్టీ కూడా తప్పులు ఎత్తి చూపకుండా సర్వే చేపట్టామని ఆయన అన్నారు. సర్వే ఆధారంగా లెక్కలతో సహా అసెంబ్లీ ముందుంచి రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో బీజేపీ, బీఆర్ఎస్ కూడా మద్దతిచ్చాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చట్టసభలో ఆమోదం పొందిన బిల్లున గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రపతి వద్ద ఆగిపోయిన బిల్లును సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.