– లొసుగుల పుట్టగా కొత్త జిల్లాలు
– మండలాలు, డివిజన్లు కూడా..
– అడిగితే కాదనకుండా మంజూరు
– ఆనాడు యథేచ్ఛగా పందేరం
– కొత్త కలెక్టర్ భవనాలు కట్టినా
యువతకు దొరకని ఉద్యోగాలు
– నేతల భూముల ధరలే పెరిగాయి
– అడ్డదిడ్డంగా నాటి సర్కార్ నిర్ణయాలు
– వాటిని సరిచేసే యోచనలో రేవంత్
– బీఆరెస్‌కు అస్త్రంగా మారే అవకాశం!
– జోనల్ వ్యవస్థ, ఉద్యోగుల కేటాయింపుల్లో
కొత్త సమస్యలు తలెత్తుతాయా?
విధాత ప్రత్యేకం: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది. 30 రోజుల పాలన సందర్భంగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని, జిల్లాల సంఖ్య తగ్గిస్తామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలతో పాటు మండలాల పునర్వ్యవస్థీకరణ కూడా చేస్తామన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రావిర్భావం నాటికి ఉన్న పది జిల్లాలను పాలనా సౌలభ్యం పేరుతో 33 జిల్లాలకు పెంచింది. 464 మండలాలను 612 మండలాలుగా విభజించింది. రెవెన్యూ డివిజన్లు 37 ఉంటే వాటిని 74కు పెంచారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 464 మండలాలు ఉంటే.. వాటిని 612కు పెంచారు. 8368 గ్రామపంచాయతీలను 12,769 గ్రామపంచాయతీలుగా పునర్వ్యవస్థీకరించారు.
ప్రజల కోరికా? బీఆరెస్ రాజకీయ అవసరమా?
భారీ విస్తీర్ణంలో ఉన్న ఉమ్మడి జిల్లాలను పునర్వ్యవస్థీకరించడం వల్ల పాలనా సౌలభ్యం ఏర్పడిన మాట వాస్తవమే అయినప్పటికీ.. ప్రత్యేకించి ప్రజాభిప్రాయానికంటే ఎక్కువగా కేసీఆర్ ఇష్టాయిష్టాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల లాబీయింగ్ కూడా పనిచేశాయని చెబుతుంటారు. పునర్విభజన సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ, ముందస్తు కసరత్తు లేకుండా హడావిడిగా నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తొలుత 31 జిల్లాలను ఏర్పాటు చేసిన కేసీఆర్ అనంతరం సమ్మక్క ములుగు, నారాయణపేట జిల్లాలను ప్రకటించి తనకు ఇష్టమైన ఆరు సంఖ్యకు అనుగుణంగా 33 జిల్లాలను ఏర్పాటు చేశారన్న అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి.
వికటించిన వికేంద్రీకరణ
పరిపాలనను వికేంద్రీకరించి, ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామన్న అప్పటి కేసీఆర్ ప్రభుత్వం.. ఆ ప్రక్రియలో మొదటగా కొత్త జిల్లాలకు కొత్త కలెక్టరేట్ భవన సముదాయాలు నిర్మించే పనిని తలకెత్తుకున్నది. తమ భూములకు సమీపంలోని ప్రాంతాల్లో కలెక్టరేట్లను కట్టించుకునేందుకు మంత్రులు ఆసక్తి చూపారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తమ భూముల సమీపంలో కలెక్టరేట్లు ఉంటే.. భూముల ధరలకు రెక్కలొస్తాయని అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే కొత్త కలెక్టరేట్ల సమీపంలోని భూముల ధరలు అమాంతం పెరిగాయి. మరోవైపు కొత్త భవనాలతో కాంట్రాక్టర్లకు ‘పని’ దొరికింది. నాయకులకు కమీషన్లు అందాయి. అయితే 33 జిల్లాలకు తగ్గ అధికారుల, ఉద్యోగస్తులు, సిబ్బంది నియామకం మాత్రం కొత్తగా చేపట్టలేదు. కొత్త జిల్లాల పాలనా వ్యవస్థకు అనుగుణంగా అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా.. ఉన్న అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని జిల్లాల మధ్య విభజన చేసి చేతులు దులుపుకొన్నది. కొత్త కార్యాలయాలు కడుతున్నందున కొత్తగా కొలువులు వస్తాయని ఆశగా ఎదురు చూసిన నిరుద్యోగులకు ఆశలే మిగిలాయి. ఉన్న ఉద్యోగస్తులకే పదోన్నతులు కల్పిస్తూ కాలం వెళ్లదీయడంతో భారీగా ఖాళీలు పెరిగిపోతూ వచ్చాయి. దీన్ని ప్రశ్నించాల్సిన తెలంగాణ ఉద్యోగ సంఘాలు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అంటకాగి చేష్టలుడిగి కూర్చుండిపోయాయన్న అపప్రథను మూటగట్టుకున్నాయి. ఫలితంగా కొత్త భవంతులు వచ్చినా.. అవి నామమాత్రంగా మారిపోయాయి.
అద్దె భవనాలతో సొమ్ము చేసుకున్న బీఆరెస్ నేతలు
కొత్త జిల్లాలు ఏర్పడినా, తగిన వసతులు లేకపోవడంతో అప్పట్లో అనేకమంది ఆయా జిల్లాల బీఆరెస్ నాయకులు తమ భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. సమీకృత కలెక్టరేట్ భవనాలు పాత, కొత్త జిల్లాల్లో అందుబాటులోకి వచ్చినప్పటికీ అనేక జిల్లాల్లో ఇంకా అద్దె భవనాలలోనే కొనసాగుతున్నాయి.
స్థాయి తగ్గిన అధికారుల హోదాలు
కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్లు, ఎస్పీల హోదాలు కార్యక్షేత్రంలో ఆర్డీవోలు, డిఎస్పీల స్థాయి దిగజారిపోయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఉద్యోగ స్కేల్ ప్రకారం వారికి ఉండే హోదా పక్కన పెడితే పాలనాపరంగా క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఆర్డీవో స్థాయికి, ఆర్డీవో ఎమ్మార్వో స్థాయికి, ఎమ్మార్వో వీఆర్వో స్థాయికి పడిపోయారు. ఎస్పీలు డీఎస్పీల స్థాయికి, డీఎస్పీలు సీఐల స్థాయికి పడిపోయారు.
పరిధి తగ్గినా.. పెరిగిన పనులు
గతంలో పది ఉమ్మడి జిల్లాల్లోని మండలాల సమావేశాలకు హాజరయ్యేందుకు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇబ్బంది ఉండకపోయేది. కానీ.. తన నియోజకవర్గంలో జిల్లాలు, మండలాలు పెరిగిపోవడంతో వాటన్నింటి సమావేశాలకు హాజరయ్యేందుకు అప్పట్లో విముఖత చూపేవారు. తమ కార్యాలయాలు ఇండ్ల నుండే అవసరమైన అభివృద్ధి పనులను కొనసాగించారు. ఇదే తరహాలో జిల్లా పరిషత్తులు సైతం తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. అసెంబ్లీ తరహాలో సాగాల్సిన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలు.. మండల పరిషత్తు సర్వసభ్య సమావేశాలను తలపించాయి. ఇక మండల పరిషత్తు సమావేశాలు, గ్రామపంచాయతీ సమావేశాల పరిస్థితిని ఊహించుకోవచ్చు. తండాల్లోని గ్రామపంచాయతీల్లో కొన్నిచోట్ల బోర్డులకు సైతం దిక్కులేదు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం ద్వారా జనాభాను అనుసరించి వచ్చే నిధులతో కనీస అభివృద్ధి పనులకు సరిపోని పరిస్థితి నెలకొన్నది. పెద్ద పంచాయతీలలో ఉండటం ద్వారా తమకు నిధుల వెసులుబాటు ఉండేదని, ఇప్పుడు తమకు ఎమ్మెల్యేలు, ఎంపీలు మంజూరు చేస్తే తప్ప కేంద్ర రాష్ట్రాల నుంచి వచ్చే నిధులు గ్రాంట్లుగా తగ్గిపోయాయని సర్పంచ్‌లు వాపోతున్నారు.
సీఎం వాదన సహేతుకమేనా..
తెలంగాణలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 33 జిల్లాలు ఏర్పాటుచేసిన గత సీఎం కేసీఆర్ జిల్లాల పేర్లు కూడా చెప్పలేరన్నారు. కొన్ని జిల్లాల్లో ముగ్గురు నలుగురు జడ్పీటీసీలు మాత్రమే ఉన్నారని చెబుతూ.. జడ్పీ సమావేశం నిర్వహిస్తే వేదికపై ఉండేవారు తప్ప కింద ఉండే వారు లేరంటూ జిల్లాల ఏర్పాటులో డొల్లతనాన్ని బయటపెట్టారు. అందుకే జిల్లాలు, మండలాల విభజనపై బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తామని, దీనికోసం జ్యూడిషియల్ కమిషన్ నియమించి, ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
తిరోగమన చర్య అంటున్న బీఆర్ఎస్
జిల్లాలను పునర్వ్యవస్థీకరించే చర్య ఇప్పటికే వ్యవస్థీకృతమైన జిల్లాలను, మండలాలను గందరగోళపరిచి, పరిపాలనను అస్తవ్యస్తం చేయడమేనని బీఆరెస్ విమర్శిస్తున్నది. కొత్త, చిన్న జిల్లాలతో పాలన ప్రజలకు చేరువైందని, కలెక్టర్లు, అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ మరింత పెరిగిందని వాదిస్తున్నారు. గతంలో కలెక్టర్లను, ఎస్పీలను కలవాలంటే వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేదని, ఇప్పుడు దగ్గరలోనే కొత్త జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఉండటంతో తమ పనులు సులభంగా చేసుకోగలుగుతున్నామని ప్రజలు భావిస్తున్నారనేది బీఆరెస్ వాదన. ఈ వాదనే సరైందని అనుకుంటే.. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాదర్బారుల్లో ప్రజలు పెద్ద ఎత్తున సమస్యలు విన్నవించుకునేందుకు ఎందుకు వస్తున్నారన్నది ఆలోచింపజేస్తున్న విషయం.
లాభాలున్నాయా?
జిల్లాలను పునర్వ్యవస్థీకరించి, జిల్లాల సంఖ్యను తగ్గించాలనుకోవడంలో లాభనష్టాలు రెండూ ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. పరిపాలన, ఆర్థిక కోణంలో జిల్లాల కుదింపు కొంత లాభదాయకంగా కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే గత ప్రభుత్వం జిల్లా కేంద్రాలవారీగా నిర్మించిన కొత్త కలెక్టరేట్లు, ఎస్పీల కార్యాలయాలు, రవాణా శాఖ కార్యాలయాలు, ఉద్యోగ వ్యవస్థలు.. పునర్వ్యవస్థీకరణ సక్రమంగా నిర్వహించని పక్షంలో వృథా అవుతాయంటున్నారు. అయితే వాటిని ఆసుపత్రులు, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు, ప్రభుత్వ విద్యాసంస్థలు వంటివి నిర్వహించుకునేందుకు అవకాశాలు లేకపోలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏర్పాటైన జిల్లాలను మళ్లీ రద్దు చేస్తే అక్కడి ప్రజలు ఊరుకుంటారా? అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా అనేక ప్రాంతాల ప్రజలు తమకు జిల్లా కావాలంటూ రోడ్డు ఎక్కారు. కొన్నిచోట్ల నెలల తరబడి నిరసనలు కొనసాగాయి. గతంలో తాము పోరాడి సాధించుకున్న జిల్లాలు, మండలాలను రద్దు చేస్తే ప్రజలు ఎలా స్వీకరిస్తారన్నది రేవంత్ సర్కారుకు గట్టి సవాలుగా నిలువనున్నది. అదే జరిగితే ప్రతిపక్ష బీఆరెస్ మళ్లీ రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టేందుకు ఒక అస్త్రాన్ని ఇచ్చినట్టే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అశాస్త్రీయం ఇందుకే!
గత ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఆశాస్త్రీయంగా వ్యవహరించిందనడానికి ఎక్కువ సంఖ్యలో ఏర్పాటయిన జిల్లాలు, మండలాలను ఉదాహరణగా నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ వంటి నగరాన్ని మరిన్ని జిల్లాలుగా ఏర్పాటు చేయకపోవడాన్ని కూడా వారు తప్పు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను మూడు లేదా నాలుగు జిల్లాలుగా విభజించాలనే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగితే రాష్ట్రంలో అతిపెద్ద విస్తీర్ణంలో ఉన్న నల్లగొండ జిల్లా నుంచి మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాలను వేరు చేసి జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మరోసారి ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ పరుతో సాహసానికే దిగుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.