500కే గ్యాస్ బండ.. వినియోగదారుల్లో అయోమయం

కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుకు సన్నద్ధమవుతోంది. త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలెండర్ల పథకాన్ని ప్రజలకు చేరువ చేయనుంది

  • Publish Date - December 16, 2023 / 01:51 PM IST

– ఈకేవైసీ కోసం ఏజెన్సీల ఎదుట బారులు

– రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టం కాని ఆదేశాలు

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుకు సన్నద్ధమవుతోంది. త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలెండర్ల పథకాన్ని ప్రజలకు చేరువ చేయనుంది. ఈక్రమంలో మహిళలు కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల ముందు బారులుదీరుతున్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీలు లబ్ధిదారుల క్యూలైన్లతో కనిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివస్తుండటంతో గ్యాస్ ఏజెన్సీలు కిక్కిరిసిపోతున్నాయి.


ఏజెన్సీలు తెరవకముందే వచ్చి కూర్చొని పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ సిలిండర్ రాయితీ పొందాలంటే ఆధార్ కార్డు, కేవైసీ ఇవ్వాలన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయాన్నీ ప్రకటించకపోయినప్పటికీ ప్రజలు గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల ఎదుట పెద్ద సంఖ్యలో బారులుదీరుతున్నారు. పనులన్నీ మానుకొని తిరుగుతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రద్దీని నియంత్రించేందుకు గ్యాస్ ఏజెనీ నిర్వాహకులు టోకెన్లు జారీచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్ద నిత్యం ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఉజ్వల పథకానికి కొనసాగుతున్న ఈకేవైసీ

కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద ఉచితంగా అందజేస్తున్న గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈనెల 31లోగా ఈకేవైసీ చేయించాలని ఆదేశాలిచ్చింది. అయితే ఈ పథకం కింద ఉచితంగా వంట గ్యాస్ పొందుతున్న లబ్ధిదారుల ఆధార్ నెంబర్ తో ఈకేవైసీ అనుసంధానం చేయించాల్సి ఉంది. ఇందుకోసం రెండు నెలల నుండి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పనిలో పనిగా రెగ్యులర్ కనెక్షన్ దారులు కూడా ఈకేవైసీ చేయించుకోవాలని గ్యాస్ ఏజెన్సీలు సూచించాయి.


ఒకవేళ గడువులోగా ఈకేవైసీ చేయించుకోకపోతే కనెక్షన్లు రద్దవుతాయని ప్రచారం జరగడంతో జనం గాబరా పడిపోతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.500కే సిలెండర్ ఇస్తామని హామీ ఇవ్వడం మరికొంత అయోమయం నెలకొంది. దీంతో గ్యాస్ వినియోగదారులు రోజుల తరబడి, గంటలపాటు ఏజెన్సీల ముందు బారులుదీరుతున్నారు. ఇదిలాఉంటే రూ.500 వంట గ్యాస్ పథకానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇంకా రాలేదని, ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియకు గ్యారెంటీ పథకానికి సంబంధం లేదని ఆదిలాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఉజ్వల పథకం కింద కనెక్షన్లు పొందిన వారు మాత్రమే ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.

Latest News