రాష్ట్రాన్నిఅప్పుల పాలు చేసి మాపై నిందలా: డిప్యూటీ సీఎం భట్టి

మిగులు రాష్ట్రంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన తెలంగాణను 7లక్షల కోట్ల అప్పుల పాలు చేసి, విద్యుత్తు, సాగునీటి రంగాలను నాశనం చేసి తెలంగాణ ప్రజల భావస్వేచ్చను హరించిన మాజీ సీఎం కేసీఆర్ తిరిగి ఎన్నికల ప్రచార సభలలో మాపై విమర్శలు చేస్తారా

  • Publish Date - April 14, 2024 / 07:40 PM IST

విద్యుత్తు రంగం అస్తవ్యస్తం చేశారు
మీ పదేళ్ల పాలనపైన..మా వంద రోజుల పాలనపైన చర్చకు సిద్దం
మాజీ సీఎం కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్‌

విధాత : మిగులు రాష్ట్రంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన తెలంగాణను 7లక్షల కోట్ల అప్పుల పాలు చేసి, విద్యుత్తు, సాగునీటి రంగాలను నాశనం చేసి తెలంగాణ ప్రజల భావస్వేచ్చను హరించిన మాజీ సీఎం కేసీఆర్ తిరిగి ఎన్నికల ప్రచార సభలలో మాపై విమర్శలు చేస్తారా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి సెక్రటేరియట్ కు రాకుండా ప్రజలను కలవకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన గత బీఆరెస్‌ పాలకులు ఇప్పుడు నీతి సూత్రాలు వల్ల వేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో నాణ్యమైన కరెంటును అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కరెంటు ఇవ్వట్లేదు అని విమర్శలు చేయడం సరికాదన్నారు. లత్కోర్లు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారని కేసీఆర్ దిగజారి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ మూడు నెలల ప్రజాపాలనపై, బీఆరెస్ పదేళ్ల పాలనపై చర్చకు నేను సిద్ధమని, దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ చేశారు. కాళేశ్వరం, సాగునీటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల రుణాలు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలపై భారం వేసిన గత బీఆరెస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని, ప్రాజెక్టు విద్యుత్ బిల్లు10వేలకోట్ల రూపాయలు చెల్లించే దుస్థితి తెచ్చారని మండిపడ్డారు. పదేళ్ల బీఆరెస్ పాలకులు చేసిన అవినీతి, అక్రమాలను తప్పకుండా బయటకు తీస్తామన్నారు. అప్పులతో కూడిన రాష్ట్రాన్ని చిందరవందర చేసి చేతికిచ్చినప్పటికీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టామని, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసే ఏజెన్సీ మహిళలకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులను చెల్లించామని, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ సంవత్సరాల తరబడి వేతనం లేనటువంటి స్వీపర్లకు, ఆశ, అంగన్వాడి వర్కర్లకు ప్రతినెల వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో పెండింగ్ లో ఉన్న డైట్ బిల్లులను చెల్లించామని తెలిపారు. వైయస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన వడ్డీ లేని రుణాలను తిరిగి ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేస్తున్నామని, లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఆర్థికంగా అందించి వారిని బలోపేతం చేయడం కోసం ప్రభుత్వమే వారికి ఇచ్చిన రుణాలపై వడ్డీలను చెల్లిస్తుందన్నారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నామన్నారు.

అనాలోచితంగా విద్యుత్తు ప్రాజెక్టులు
యాదాద్రి , భద్రాద్రి పవర్ ప్రాజెక్టు పనులను టెండర్లు లేకుండా ఇష్టారాజ్యంగా నామినేషన్ పద్ధతిపై ఇచ్చిన గత ప్రభుత్వం తీరును ప్రజలు నిలదీయాలన్నారు. దుర్బుద్ధితో అనాలోచితంగా గత పాలకులు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును మొదలుపెట్టారని, గత పాలకుల అలసత్వం అశ్రద్ధ అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ ప్రాజెక్టు వ్యయం 35 వేల కోట్ల రూపాయలకు పెరిగి ప్రభుత్వానికి గుదిబండగా తయారైందని ఆరోపించారు. 350 కిలోమీటర్ల దూరం నుంచి బొగ్గు రవాణా చేయడం వల్ల ముడి సరుకు వ్యయం పెరగనుందని, బొగ్గు దొరికే ప్రాంతంలో పవర్ ప్లాంట్ పెట్టకుండా అవినీతి అక్రమాలు చేయాలని బొగ్గు రవాణాకు దూరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని విమర్శించారు. 2015 సంవత్సరంలో మొదలుపెట్టిన యాదాద్రి పవర్ ప్లాంటుకు పర్యావరణ అనుమతులు తీసుకురాలేదని, అనుమతుల కోసం తప్పుడు సమాచారం ఇవ్వడంతో 2022 సెప్టెంబర్ 30న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదరన్ జోన్ చెన్నై పర్యావరణ అనుమతులను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. 2023 డిసెంబర్ 6 వరకు అధికారంలో ఉన్న బీఆరెస్‌ పాలకులు యాదాద్రి పవర్ ప్లాంట్ పర్యావరణ అనుమతుల కోసం భారత ప్రభుత్వం వద్ద ఎలాంటి చొరవ చూపలేదని, ఇంపోర్టెడ్ బొగ్గు తీసుకువచ్చి కాలుష్యం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని తప్పుడు సమాచారం ఇచ్చి భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను బీఆరెస్‌ పాలకులు మోసం చేశారని దుయ్యబట్టారు. బీఆరెస్‌ పాలకుల అలసత్వం వల్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ వ్యయం 25వేల కోట్ల నుంచి 35వేల కోట్ల రూపాయలకు పెరిగి ప్రజలపై 10వేల కోట్ల అదనపు భారం పడిందన్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ ప్రజల భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విభజన చట్టంలో 4వేల మెగావాట్ల విద్యుత్తును కేటాయిస్తూ చట్టంలో పొందుపరిచారని, 10సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆరెస్‌ పాలకులు చట్ట ప్రకారంగా రావలసిన విద్యుత్తు తయారు చేసే ఎన్టీపీసీని విస్మరించి కమిషన్ల కక్కుర్తి కోసం ద్రోహ బుద్ధితో యాదాద్రి, భద్రాది పవర్ ప్రాజెక్టు పనులను మొదలుపెట్టారని భట్టి ఆరోపించారు. రానున్న 25 సంవత్సరాలు రూ.5.59లకు యూనిట్ చొప్పున సోలార్ విద్యుత్ అందించడానికి సోలార్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని, ఎన్‌టీపీసీ విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల యూనిట్‌కు దాదాపు 9 రూపాయల వ్యయం అవుతుందని, సోలార్ విద్యుత్తు యూనిట్‌కు ఐదు రూపాయల 59 పైసలకే ప్రజలకు అందే పరిస్థితిలో యూనిట్‌కు 9 రూపాయల వ్యయంతో తయారయ్యే ఎన్‌టీపీసీ విద్యుత్తు అవసరమా ప్రజలు ఆలోచించాలని కోరారు.

Latest News