హైదరాబాద్, అక్టోబర్ 03(విధాత): ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలంపాడు గ్రామ పంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీలకు కేటాయించినప్పటికీ. ఊర్లో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో 20 ఏండ్లుగా ఉపసర్పంచ్‌గా గెలిచిన వ్యక్తికే సర్పంచ్ అధికారాలు అప్పగిస్తున్నారు. గత 20 సంవత్సరాలు గా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా ఈ సారి కూడా సేమ్ సీన్ రిపీట్ కానుంది. నూకలంపాడు గ్రామంలో మొత్తం 1,063 మంది ఓటర్లు, ఎనిమిది వార్డులు ఉన్నాయి. ఈ గ్రామం షెడ్యూల్డ్ ఏరియా కింద ఉండడంతో సర్పంచ్ పదవితో పాటు నాలుగు వార్డులను ఎస్టీలకు రిజర్వ్ చేయగా. మిగిలిన నాలుగు వార్డులను జనరల్ గా నిర్ణయించారు. అయితే గ్రామంలో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేక పోవడంతో 2004 నుంచి అక్కడ సర్పంచ్ పదవితో పాటు నాలుగు వార్డులు ఖాళీగానే ఉంటున్నాయి.
ఈ క్రమంలో జనరల్‌కు కేటాయించిన నాలుగు వార్డుల్లో ఎన్నికైన వారి నుంచే ఒకరిని ఉపసర్పంచ్‌గాచఎన్నుకుంటూ సర్పంచ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. 2004, 2009, 2015, 2020 ఎన్నికల్లో ఇదే పద్ధతి కొనసాగగా… త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మళ్లీ ఉపసర్పంచ్‌కే సర్పంచ్ బాధ్యతలు అందనున్నాయి. మరో వైపు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఎన్.వీ. బంజర సర్పంచ్ పదవి బీసీ మహిళకు, రాములుతండా సర్పంచ్ పదవిని బీసీ జనరల్ కు కేటాయించారు. ఈ గ్రామాల్లోనూ బీసీలు లేకపోవడంతో వార్డు సభ్యుల నుంచే ఒకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకొని, వారికే సర్పంచ్ బాధ్యతలు అప్పగించనున్నారు.