వీఆర్వోల హక్కుల సాధనకు మూడంచెల కార్యాచరణ
పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి…
త్వరలోనే ఐదు వేల మంది వీఅర్వోలతో సభ
ఖమ్మం: రాష్ట్రంలోని వీఆర్వోలను మాతృ సంస్థలోనే కొనసాగించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర కార్యవర్గ నిర్ణయాలలో భాగంగా మొత్తం మూడంచెల కార్యాచరణతో ప్రత్యేక ప్రణాళికతో మందుకెళుతున్నామని తెలిపారు. మొదటి దశలో రాష్ట్రంలోని అందరూ కలెక్టర్లను కలిసి మెమొరాండాలు సమర్పించి పూర్వ వీఆర్వోలను రెవిన్యూ శాఖలకు తిరిగి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. రెండవ దశలో మంత్రులు, మొత్తం 119 మంది శాసనసభ్యులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు. మూడవ దశలో మొత్తం 5000 మంది వీఆర్వోలతో రాష్ట్రవ్యాప్త మహాసభ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1998 సంవత్సరం నుండి రెవెన్యూ శాఖలో వేర్వేరు పేర్లతో వీఆర్వోలుగా పనిచేస్తూ, ప్రతీ సందర్భంలో ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచిన తమను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘‘తెలంగాణ వీఆర్వో వ్యవస్థ రద్దు చట్టం 2020 ద్వారా ఏపకక్షంగా రద్దు చేసి, రీడెప్లాయిమెంట్ పేరుతో 1 ఆగస్టు 2022న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,576 మంది వీఆర్వోలను లాటరీ ద్వారా ఏకపక్షంగా, బలవంతంగా బదిలీ చేశారని తెలిపారు. దీంతో వీఆర్వోలు తమ ఉనికిని కోల్పోయారని ఉపేంద్ర రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా సర్వీస్ మ్యాటర్ సంబంధ సమస్యలు, ఉద్యోగ హక్కుల ఉల్లంఘనలు ఎదుర్కొంటున్నామని అన్నారు. ప్రభుత్వానికి వెలుపల ‘‘సొసైటీలు (మైనారిటీ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్ళు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యా సంస్థలు) మైనారిటీ కార్పొరేషన్లుబీ స్వయంప్రతిపత్తి సంస్థలు (జిల్లా గ్రంథాలయాలు) షుగర్ కేన్ కమిషన్లు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ తదితరాల్లో నియమించారు. సొసైటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వ బడ్జెట్ లభ్యత మేరకు మూడు నెలలకోసారి వేతనాలు మంజూరు చేస్తున్నారనీ, దీని వల్ల వీఆర్వోల పిల్లల విద్య, వైద్య ఖర్చులతో పాటు నెలవారీ కుటుంబ నిర్వహణ ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వోల వేతనం నుంచి జీపీఎఫ్, సీపీఎస్, టీఎస్ జీఎల్‌ఐ చందా చెల్లింపులు నిలిచిపోయాయని గుర్తుచేశారు. దీంతో వీఆర్వోల పదవీ విరమణ అనంతర సామాజిక భద్రత ప్రమాదంలో పడిందని గరికె ఉపేంద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన 5శాతం ఐఆర్ పెంపుదలకు వీఆర్వోలు అర్హులు కావడం లేదని పేర్కొన్నారు. పూర్వ వీఅర్వోల పాత సీనియారిటీని రీడెప్లొయ్ చేయబడిన కొత్త శాఖల్లో తిరస్కరిస్తున్నారని తెలిపారు. ‘‘వీఆర్వో వ్యవస్థ రద్దు చట్టం, 2020’’ ప్రకారం వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్ తత్సమాన పోస్టుల్లో నియమించాల్సి ఉండగా, కొన్ని ప్రభుత్వ శాఖలలో శాంక్షన్లు పోస్టులు లేక జూనియర్ అసిస్టెంట్ కంటే తక్కువైన ‘‘తోటమాలి/వార్డ్ ఆఫీసర్/ రికార్డ్ అసిస్టెంట్ /స్టోర్ కీపర్/కంప్యూటర్ ఆపరేటర్/హాస్టల్ వర్కర్/లైబ్రేరియన్/డ్రైవర్లు / వంట మనిషి/కామటి / స్వీపర్’’ వంటి పోస్టుల్లో నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు.