నీళ్లివ్వండి.. మహాప్రభో! సాగర్‌ ఆయకట్టులో రైతుల అరిగోస

  • పంట సాగుకు భూగర్భ జలాలే దిక్కు
  • దానికీ తీవ్ర కరెంటు కోతలతో కటకటలు
  • వరుణుడి కరుణ లేక కృష్ణమ్మ వెలవెల
  • వరద లేక బోసిపోయిన ఎగువ ప్రాజెక్టులు
  • గోసపడుతున్న ఎడమకాల్వ అన్నదాతలు
  • ఏటా 3.81 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు
  • ఈ దఫా 1.57 లక్షల ఎకరాలకే పరిమితం
  • 2001 తర్వాత ఇంతటి తీవ్ర వర్షాభావం ఇదే!


ఈ ఏడాది వరుణుడి కరుణ కరువైంది! వరద శోభ లేక.. కృష్ణమ్మ వెలవెలబోతున్నది! దాని ప్రభావం ఆధునిక దేవాలయంగా భాసిల్లే నాగార్జునసాగర్‌పై తీవ్రంగా కనిపిస్తున్నది! పంటల పొలాలకు నీరుపారే తోవ కనిపించక అన్నదాతలు అరిగోసపడుతున్నారు! వానలు ఆలస్యంగానైనా పడకపోతాయా… కొన్నొద్దులకైనా సాగర్‌ నిండకపోతుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు!

(విధాత ప్రత్యేకం)

వర్షాలు లేక, వరదలు రాక.. నిండుకున్న నాగార్జునసాగర్‌ జలాశయం.. రైతుల్లో గుబులు రేపుతున్నది. నమ్మకున్న కృష్ణమ్మ మోసం చేయదులే అన్న ఆశతో కొందరు రైతులు భూగర్భ జలాలపైనే ఆధారపడి వరి సహా ఇతర పంటలు సాగు చేపట్టారు. అయితే.. సెప్టెంబర్‌ మాసం కూడా పూర్తవుతున్నా.. సాగర్‌లో జలకళ లేకపోవడంతో ఆయకట్టు రైతుల సాగునీళ్ల కోసం తంటాలు పడుతున్నారు. అటు.. భూగర్భ జలాలపై ఆధారపడిన వారు.. విద్యుత్తు సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. మరికొందరు రైతులు ఇక సాగర్‌ జలాశయానికి ఈ ఏడాది వరదల భాగ్యం లేదేమోనని నిట్టూర్చుతున్నారు. భూమి లోతుల్లోకి బోర్లు వేసుకుంటూ.. కొత్తగా విద్యుత్తు కనెక్షన్ల కోసం తిప్పలు పడుతూ.. ఆలస్యంగానైనా పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు. 


ఈ దఫా 1.57లక్షల ఎకరాల మేరకే!


సాగర్‌ ఎడమకాలువ ఆయకట్టు పరిధిలో ఏటా 3.81 లక్షల ఎకరాల మేరకు సాగు కావాల్సివుండగా ఈ దఫా 1.57 లక్షల ఎకరాలకే వరి పంట పరిమితమైంది. సాగులో ఉన్న వరి పంటలకు కూడా నీటి కొరత పెను సమస్యగా తయారైంది. కృష్ణా పరివాహకం ఎగువన వర్షాలు లేక నారాయణపుర, ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు కనీస నీటి మట్టాలకే పరిమితమయ్యాయి. దీనితో సాగర్‌ ప్రాజెక్టు నీటి మట్టం కూడా కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నది. సాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. డెడ్‌ స్టోరేజీ 510 అడుగులు. కానీ.. ప్రస్తుతం 524.80 అడుగుల నీరు మాత్రమే ఉన్నది.

కాలువకు నీళ్లు రావు.. కరెంటు రాదు..


సాగర్‌ ప్రాజెక్టులో 2001 తర్వాత ఇప్పుడే ఇంతటి తీవ్ర వర్షాభావం చూస్తున్నామంటున్నారు ఆయకట్టు రైతులు. సాగర్‌ జలాశయానికి ఎగువ నుండి వరద నీటి లభ్యత లేకపోవడంతో సాగర్‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయలేదు. సాగర్‌కు ఆలస్యంగానైనా వరదలొస్తాయని, ఎడమ కాలువకు నీటిని విడుదల చేస్తారని ఆశపడి.. కొందరు రైతులు పంటలు సాగు చేశారు. ఇప్పుడు కాలువ పారకపోవడంతో.. భూగర్భ జలాలతోనైనా పంటలు పండించుకుందామని చూస్తే.. సమయానికి కరెంటు సక్రమంగా అందడం లేదని వాపోతున్నారు.


విద్యుత్తు కార్యాలయాల ఎదుట ఆందోళనలకు దిగుతున్నారు. కరెంటు ఆరేడు గంటలు మాత్రమే వస్తుండటంతో.. పొట్ట దశలో ఉన్న వరి పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. తమకు సరిపడా కరెంటైనా సరఫరా చేయాలని, లేదంటే సాగర్‌ ఎడమకాలువకు నీటినైనా విడుదల చేయాలని మొత్తుకుంటున్నారు. ఇదే సమస్యపై హుజూర్‌నగర్‌ పరిధిలో రైతులు రోడ్డెక్కడం ఆయకట్టు అన్నదాతల కష్టాలకు నిదర్శనంగా నిలుస్తున్నది.

పెరుగుతున్న బోర్లు.. విద్యుత్తు కనెక్షన్లు


సాగర్‌ ఆయకట్టులో ప్రస్తుతం సాగువుతున్న పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు పాత బోర్లు, బావులకు మరమ్మతులు చేయిస్తుంటే.. భూగర్భ జల వసతి లేని మరికొందరు రైతులు కొత్తగా భారీ సంఖ్యలో బోర్లను వేస్తున్నారు. కొత్త విద్యుత్తు కనెక్షన్లు తీసుకుంటున్నారు.


తాజాగా సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో విద్యుత్తు కనెక్షన్ల కోసం 9వేలకుపైగా దరఖాస్తులు వస్తే.. అందులో సాగర్‌ ఆయకట్టు ప్రాంతాల్లోని సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్‌నగర్‌ డివిజన్ల పరిధిలోనే 6 వేలకుపైగా ఉండటం.. రైతులు భూగర్భ జలవనరుల కోసం పడుతున్న తిప్పలకు నిదర్శనంగా నిలుస్తున్నది.

Latest News