Site icon vidhaatha

Heavy Rains | రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

Heavy Rains : ఈసారి దేశవ్యాప్తంగా వాతావరణం భిన్నంగా ఉంది. అడపాదడపా వానలు కురుస్తున్నా ఇంకా కావావల్సిన మేర వర్షపాతం నమోదు కాలేదు. చాలా ప్రాంతాల్లో విత్తనాలు చల్లిన అన్నదాతలు.. అవి మురిగిపోకుండా ట్యాంకర్ల ద్వారా నీరు పారిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక పల్లెల్లో పరిస్థితి ఇలా ఉంటే.. నగరంలో మాత్రం నాలుగు చినుకులు పడ్డా భారీ వర్షం కురిసినట్టుగా ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. రోడ్ల మీద తటాకాలను తలపించేలా నీరు నిలిచిపోతున్నది.

ఈ క్రమంలో రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. నేడు కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి రుతవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వరంగల్, హనుమకొండ, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీచేశారు. ఇక హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం నుంచి వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. సాయంత్రానికి నగరంలో జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు. భారీ వర్షాలకు తోడు బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. గంటకు దాదాపుగా 30-45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పుకొచ్చారు. అనేక ప్రాంతాల్లో ఈదురు గాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.

కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధకారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని.. చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. వ్యవసాయ పనులు చేసుకునేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇక జూన్‌ నెలలో రాష్ట్రంలో ఆశించిన మేర వర్షపాతం నమోదు కాలేదు. కానీ జూలైలో జోరు వానలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇది నిజంగా రైతులకు చల్లని కబురే.

Exit mobile version