Renu Desai | సెకండ్ ఇన్నింగ్స్‌లో సెలక్టెడ్ పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్న నటి రేణూ దేశాయ్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న నటి రేణు దేశాయ్ ఇటీవల తీవ్ర ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కుక్కల సంరక్షణ అంశంపై నిర్వహించిన ప్రెస్ మీట్ అనంతరం ఆమెపై అసభ్యకర కామెంట్స్ వెల్లువెత్తాయి.
కుక్కల అంశంపై ప్రెస్ మీట్.. ట్రోలింగ్ ప్రారంభం
జనవరిలో కొన్ని ఎన్‌జీవోల తరఫున కుక్కల సంరక్షణ, బాధ్యతాయుత పెంపకం వంటి అంశాలపై రేణు దేశాయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తరువాత ఆమె సోషల్ మీడియా పోస్టుల కింద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దూషణలకు దిగారు. “కుక్కలు నిన్ను కరిస్తే తెలుస్తుంది” అంటూ అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. వ్యక్తిగత జీవితాన్ని లాగుతూ అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆమె వెల్లడించారు.
వీడియో ద్వారా ఆవేదన
రెండు రోజుల క్రితం రేణు దేశాయ్ ఓ వీడియో విడుదల చేసి తన ఆవేదన వ్యక్తం చేశారు.
“నా డైవర్స్ నుంచే నెగిటివ్ కామెంట్స్ వింటూనే ఉన్నాను. ఇవన్నీ ఆగిపోయాయని అనుకున్నాను. కానీ ఇటీవల కుక్కల కోసం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మరింతగా దూషణలు పెరిగాయి. నా పర్సనల్ లైఫ్‌పై కూడా మాట్లాడుతున్నారు. చెప్పలేని పదాలతో తిడుతున్నారు. అసహ్యం వేస్తుంది” అని ఆమె అన్నారు. ఇకపై ఇలాంటి దూషణలను ఉపేక్షించబోనని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
సైబరాబాద్ సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు
తాజాగా రేణు దేశాయ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి అధికారికంగా ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తన పోస్టుల కింద అసభ్యకర కామెంట్స్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాను ఎదుర్కొంటున్న మానసిక ఇబ్బందులను వివరించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రేణు దేశాయ్ తీసుకున్న ఈ నిర్ణయానికి పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం నేరమని, బాధ్యులపై కఠిన చర్యలు అవసరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
