విధాత, హైదరాబాద్ : ధరణి బాగాలేకపోతే మీరు ఎందుకు వినియోగిస్తున్నారని, పేరు మాత్రమే ఎందుకు మార్చుతున్నారని బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీలో ధరణిపై జరిగిన చర్చలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ధరణి పోర్టల్‌పైన, మాజీ సీఎం కేసీఆర్‌పైన రెవెన్యూ మంత్రి పొంగులేటి చేసిన విమర్శలను తిప్పికొట్టారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పేరును నాలుగు గోడల మధ్య పెట్టలేదని.. అనేక రివ్యూలు చేసి అందరి సమక్షంలో నిర్ణయించిన పేరే ధరణి అని రాజేశ్వర్ రెడ్డి వివరించారు. రెవెన్యూ చట్టాలను మార్చేందుకు కేసీఆర్ నిర్వహించిన పలు సమావేశాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారని గుర్తు చేశారు. దురదృష్టమో అదృష్టమో పొంగులేటి ఇప్పుడు మంత్రి అయ్యారని, మిగతా కాంగ్రెస్ మంత్రులు తిట్టినట్టే పొంగులేటి కూడా కొన్ని అనరాని మాటలు అన్నారని, కేసీఆర్ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తప్పుబట్టారు. కేసీఆర్‌పై పొంగులేటి చేసిన విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాన్నారు. అవకాశం వచ్చినప్పుడు ఒదిగి ఉంటే మంచిదని హితవు పలికారు. ధరణి అనగానే కాంగ్రెసోళ్లకు కేసీఆర్ కనిపిస్తున్నారని, ధరణి పేరు బాగాలేదని భూమత అని పెట్టుకుంటున్నారన్నారు. ధరణి రూపకల్పనలో 2017లో ఎల్ఆర్‌యూపీ(ల్యాండ్ రికార్ట్స్ అప్‌డేషన్ ప్రోగ్రామ్స్) తీసుకున్నామని, 584 మండలాల్లో 10828 గ్రామాల్లో 15700 బృందాలు భూరికార్డులను పరిశీలించాయని, ఇందుకోసం 10809 రెవెన్యూ ఉద్యోగులు 24 వేల వీఆర్ఏలు, 535 సర్వేయర్లు కలిసి గ్రామాల్లో రికార్డులు పరిశీలించి సమాచారం తీసుకున్న తర్వాతనే పార్ట్-ఏ, పార్ట్-బీ అని పెట్టారన్నారు. పార్ట్-ఏలో వివాదాల్లేని 90 శాతం భూములు రికార్డు అయ్యాయని, 2017లో 100 రోజుల్లో ఈ పని చేశారని, వారికి బోనస్‌గా వేతనం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇలాంటి చారిత్రక నిర్ణయం ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
పార్ట్-బీలో 18 లక్షల ఎకరాలు..
160 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని సర్వేలో తేలిందని, దాంట్లో 142 లక్షల ఎకరాలు పార్ట్ ఏలో నిక్షిప్తమైందని, 18 లక్షల ఎరాల భూమి రకరకాల కారణాల చేత పార్ట్-బీలో పెట్టారని, పార్ట్-బీలో మూడు రకాల సమస్యలు వచ్చాయని పల్లా రాజేశ్వర్‌రెడ్డి వివరించారు. అన్నదమ్ముళ్ల మధ్య పంచాయతీ, గెట్టు పంచాయితీ, కోర్టు కేసుల భూములు వాటిలో ఉండవచ్చని, రెండోది రెవెన్యూ సమస్యల వల్ల, మూడోది ఐటీ పోర్టల్‌లో కొన్ని సమస్యలు వచ్చాయని పేర్కోన్నారు. అటువంటి సమస్యల కారణంగా 18 లక్షలు పార్ట్-బీలో పెట్టారన్నారు. అయితే 82 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించి గ్రామ కంఠాలు, ఫారెస్టు, ఇతర ఇన్‌స్టిట్యూషన్‌లదిగా నిర్దారించబడిందని, ప్రభుత్వ భూమి అని నిర్ధారించబడిన భూమిని ప్రొహిబిటెడ్ ల్యాండ్‌లో పెట్టారని రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.