విధాత : ఇందిరమ్మ రాజ్యంపై ప్రతిపక్ష బీఆరెస్ విమర్శలపై స్పందించిన రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యమంటే మీ మాదిరిగా కుటుంబ పాలన కాదని, పేదలకు ఇండ్లు, భూమిలేని దళిత గిరిజనులకు అసైన్డ్ భూములు, పోడు భూముల పట్టాలు, చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు ఆరోగ్యశ్రీ వైద్యం, మైనారిటీలకు సచార్ కమిటీ నివేదిక ప్రయోజనాలు, నాలుగు శాతం రిజర్వేషన్లు అందించడం, ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడం, సామాజిక న్యాయం అందించడం అని వివరించారు. ప్రతిపక్ష నేత కేటీఆర్ తన ప్రసంగంలో గవర్నర్ ప్రసంగాన్ని వినడానికి తాను సిగ్గుపడుతున్నానని అన్నారని, ఇసుక దోపిడీని అడ్డుకున్న దళితులను చంపించి, హింసించిన చరిత్ర కల్గినందుకు మీరు సిగ్గు పడాలని కౌంటర్ ఇచ్చారు.
ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం అడిగిన రైతులను సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లిన సందర్భంలో చంటి పిల్లల్ని సంకన పెట్టుకుని జైలుకెళ్లిన మహిళలను అడ్డుకున్నందు సిగ్గుపడాలన్నారు. ఈ సందర్భంగాలో వెల్‌లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేసిన బీఆరెస్ సభ్యులను స్పీకర్ వారించారు. ఈ దశలో కేటీఆర్ జోక్యం చేసుకుంటూ.. ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. 2004లో ఇసుక ద్వారా 4కోట్ల ఆదాయం వస్తే తమ పాలనలో 500కోట్ల ఆదాయం వచ్చిందని, అప్పటిదాకా ఆ డబ్బులు ఆనాటి కాంగ్రెస్ పాలకుల జేబుల్లోకి వెళ్లినట్లేనన్నారు.
పరీక్షలు పెట్టలేని అసమర్థ పాలన మీది
పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్, ఇంటర్ జవాబు పత్రాలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో తలెత్తిన పొరపాట్లతో పాతికమంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ఆనాటి ప్రభుత్వం కారణం కాదా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. పబ్లిక్ సర్వీస్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలో మీరే సిట్ వేసుకుని, మీరే దోషులను గుర్తించామని చెప్పారని, మీ పాత్ర లేనప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. పరీక్షలు నిర్వహించలేని, నియామకాలు చేపట్టిలేని అసమర్థ పాలన చేసినందుకు మీరు నిజంగానే సిగ్గుపడాలని బీఆరెస్‌పై రేవంత్ విరుచుకుపడ్డారు. స్కూల్ ఎడ్యుకేషన్ నివేదికలో తెలంగాణ 31వ స్థానంలో ఉండటం సిగ్గుతో తలవంచుకోవాల్సిందేనన్నారు.
1996జూలై 18న కేసీఆర్ సభలో జోనల్ సిస్టమ్‌ను ఎత్తివేయాలని మాట్లాడారని అందుకు సిగ్గుపడాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలను భగవద్గీత, ఖురాన్, బైబిల్ మాదిరిగా భావించి వాటి అమలుకు కృషి చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘మీతో కూడా వాటిని వల్లె వేయించి, వాటి గొప్పతనం అర్థం చేయిస్తాం. సభ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేసేది లేదు. ఎంతటి సుదీర్ఘ చర్చలకైనా మేం సిద్ధం’ అని అన్నారు. ఏ ప్రభుత్వమైనా తాము తలపెట్టిన పనులను ప్రణాళికలను గవర్నర్ ప్రసంగం ద్వారా మంత్రివర్గ ఆమోదంతో తెలియజేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
డ్రగ్స్ రహిత తెలంగాణే మా లక్ష్యం
డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, కనీసం ఇందులోనైనా ప్రతిపక్షం కలిసి రావాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ పదేళ్లలో గంజాయి, డ్రగ్స్ వినియోగం, సరఫరాలో పంజాబ్ బాటలో సాగుతుందన్నారు. డ్రగ్స్ కేసులో ఎంతటి పెద్దవారున్నా వదిలిపెట్టేది లేదని చెప్పారు. ఈ సమయంలో కేటీఆర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలనలో తమ ప్రభుత్వమే తెలంగాణ స్టేట్ యాంటి నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందని చెబుతూ.. ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ చీఫ్, సీఎం పదవి తెచ్చుకున్నవ్యక్తి తనను మేనేజ్‌మెంట్ కోటా అంటూ విమర్శించడం విడ్డూరమన్నారు.
20వ తేదీకి వాయిదా వేసిన స్పీకర్
గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మాన చర్చపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం పిదప ప్రతిపక్షం నుంచి చర్చను ప్రారంభించిన కేటీఆర్ కాకుండా హరీశ్‌రావు మాట్లాడే ప్రయత్నం చేయగా స్పీకర్ అనుమతి నిరాకరించి సభను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో హరీశ్‌రావు ఆగ్రహంతో గతంలో మేం సీఎం సమాధానంపై వివరణకు మరొకరికి కూడా అవకాశమిచ్చాని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలేమో ప్రజాస్వామ్యం.. చేతలేమో నిరంకుశంగా ఉన్నాయని విమర్శించారు.