భూప‌రిపాల‌న‌లో మార్పు రావాలి

తెలంగాణ రాష్ట్రంలో భూ ప‌రిపాల‌న వ్య‌వ‌స్థ‌లో స‌మూల‌మైన మార్పు రావాల‌ని ప్రొ.కోదండ‌రాం పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసి భూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విధంగా ఉండాల‌న్నారు

  • Publish Date - December 10, 2023 / 03:09 PM IST
  • గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాలి
  • డిప్యూటీ క‌లెక్ట‌ర్ల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో ప్రొ.కోదండ‌రాం

విధాత, హైద్రాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో భూ ప‌రిపాల‌న వ్య‌వ‌స్థ‌లో స‌మూల‌మైన మార్పు రావాల‌ని ప్రొ.కోదండ‌రాం పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసి భూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విధంగా ఉండాల‌న్నారు. రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగుల‌ను మాజీ సీఎం కేసీఆర్ అకార‌ణంగా బ‌ద్నాం చేసి..అన్ని ర‌కాల భూముల‌ను మాయం చేశార‌ని ఆరోపించారు. స‌మాజం ముందు రెవెన్యూ ఉద్యోగుల‌ను దొంగ‌లుగా చిత్రీక‌రించి ఉన్న‌ భూముల‌ను కాజేశార‌న్నారు. చివ‌ర‌కు రెవెన్యూ ఉద్యోగుల‌ను ప్ర‌జ‌ల ముందు దోషులుగా చేశార‌ని గుర్తు చేశారు. నేడు ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న‌ భూ స‌మ‌స్య‌ల‌కు, ఇత‌ర ఇబ్బందుల‌కు కార‌ణం రెవెన్యూ ఉద్యోగులు కాద‌ని నిరూపించుకోవాల్సిన దుస్థితికి తెచ్చార‌న్నారు. తెలంగాణ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం ఆత్మీయ స‌మ్మేళ‌నం బేగంపేట‌లోని హోట‌ల్ మారిగోల్డ్‌లో జ‌రిగింది. సంఘం వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు వి.ల‌చ్చిరెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మ్మేళ‌నానికి ప్రొ.కోదండరాం, ప్రొ.పీఎల్ విశ్వేశ్వ‌ర‌రావు, భూమి సునీల్‌కుమార్ హాజరై మాట్లాడారు. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మార్ప‌ణాలు చేసిన అమ‌రులంతా కూడా మంట‌ల్లో కాలిపోతూ జై తెలంగాణ అంటూ అసువులుబాశార‌న్నారు. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌లో ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర‌లేద‌న్నారు.


గ‌త ప్ర‌భుత్వం భూప‌రిపాల‌న‌లో తీసుకున్న‌త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో గ్రామాల‌లో గంద‌ర‌గోళం నెల‌కొంద‌న్నారు. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే రాయ‌ల‌సీమ ప్యాక్ష‌నిజం గ్రామాల్లో వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు భూమి హ‌క్కులు ద‌క్క‌క‌పోవ‌డంతోనే అశాంతి నెల‌కొంద‌న్నారు. ఉద్యోగులుగా హ‌క్కుల‌ను పొందుతూ.. ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం ప‌ని చేయాల‌ని సూచించారు. తెలంగాణ ప్ర‌జ‌లు ఎప్పుడూ కూడా హింస‌ను కోరుకోలేద‌న్నారు. తెలంగాణ అగ్నిగుండంగా మారొద్ద‌న్నారు. ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా జీవించే విధంగా చేసే బాధ్య‌త రెవెన్యూ యంత్రాంగం చేతుల్లోనే ఉంద‌న్నారు. కేసీఆర్ ఏనాడు కూడా ప్ర‌జ‌ల కోణం నుంచి ఆలోచ‌న చేయ‌క‌పోవ‌డంతోనే కొత్త ర‌క‌మైన ఇబ్బందులు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వ‌చ్చాయ‌న్నారు. మార్పు కోసం అంద‌రం క‌లిసి ప‌ని చేద్దాం అంటూ పిలుపునిచ్చారు.

రెవెన్యూ యంత్రాంగాన్ని ప‌టిష్టం చేయాలి : భూమి సునీల్‌కుమార్‌

రాష్ట్రంలో గ్రామ‌స్థాయి నుంచి భూ ప‌రిపాల‌న వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల‌ని భూమి సునీల్‌కుమార్ పేర్కొన్నారు. ఏపీలో గ్రామ స్థాయిలో 8 మంది ఉద్యోగులుండ‌గా.. మ‌న రాష్ట్రంలో ఒక్క‌రూ కూడా లేర‌న్నారు. ఇదే కాకుండా రెవెన్యూలో అధికారుల‌కు సైతం ఎలాంటి అధికారాలు లేవ‌న్నారు. రెవెన్యూలో 124 చ‌ట్టాలుండ‌గా.. అవి సైతం గంద‌ర‌గోళంగానే ఉన్నాయ‌న్నారు. వీటిన్నింటిని క‌లిపి ఒకే చ‌ట్టం చేయాల‌ని సూచించారు. భ‌ద్ర‌మైన హ‌క్కుల‌ను క‌ల్పించేలా టైటిల్ గ్యారంటీ వంటి తేవాల‌న్నారు.

హ‌క్కుల‌ను కాపాడుకుందాం.. సేవ‌కులుగా ప‌ని చేద్దాం : వి.ల‌చ్చిరెడ్డి, వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు, తెలంగాణ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల అసోసియేష‌న్‌

ఉద్యోగులుగా మ‌న హ‌క్కుల‌ను కాపాడుకుంటూనే ప్ర‌జ‌ల‌కు సేవ‌కులుగా ప‌ని చేద్దామ‌ని వి.ల‌చ్చిరెడ్డి పేర్కొన్నారు. గ్రామ స్థాయి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు కావాల్సిన సేవ‌ల‌ను అందే విధంగా ప‌ని చేద్దామ‌న్నారు. రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో రావాల్సిన మార్పుల కోసం కూడా ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్దామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య‌లో వార‌ధిలా సేవ చేద్దామ‌న్నారు. కొత్త ప్ర‌భుత్వం తీసుకొచ్చి అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌లో ఉద్యోగులుగా భాగ‌స్వాముల‌వుతూ ప్ర‌జ‌ల‌కు ఫ‌లాలు చేరే విధంగా ప‌ని చేద్దామ‌న్నారు.

తెలంగాణ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం నూత‌న క‌మిటీ ఎన్నిక‌

ఈ సంద‌ర్భంగా డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం నూత‌న క‌మిటీ ఎన్నిక జ‌రిగింది. అధ్య‌క్షులుగా వి.ల‌చ్చిరెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ‌లుగా కె.రామ‌కృష్ణ‌, ఎన్.ఆర్‌.స‌రిత‌, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌గా ర‌మేష్ రాథోడ్‌, కోశాధికారిగా కె.వెంక‌ట్‌రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్స్‌గా ఎం.కృష్ణారెడ్డి, చిన్న వెంక‌ట‌స్వామి, ర‌మాదేవి, ఎం.జ‌నార్ధ‌న్‌రెడ్డి, ఎం.శ్రీ‌నివాస్‌, ఉపాధ్య‌క్షులుగా పి.ప‌ద్మ‌ప్రియ‌, ఎన్‌.రాజేంద‌ర్‌రెడ్డి, షేక్ అమీద్‌, ఎం.విజ‌య‌కుమారి, ఎల్‌.అలివేలు, కార్య‌ద‌ర్శులుగా ఎం.ప్ర‌భాక‌ర్‌, వి.శేఖ‌ర్‌రెడ్డి, జీఎన్‌వీ రాజువ‌ర్మ‌, ఈ.అర్చ‌న‌, పి.రాంరెడ్డి, ఆర్గ‌నైజింగ్ కార్య‌ద‌ర్శులుగా టి.శ్యాంప్ర‌సాద్‌, కేఎంవీ జ‌నార్ధ‌న్‌రావు, కె.వీణా,క‌దం సురేష్‌, రాథోడ్ మోహ‌న్‌సింగ్‌, డి.దేవుజ‌, క‌ల్చ‌ర‌ల్ సెక్ర‌ట‌రీలుగా భావ‌య్య‌, కె.సురేష్‌, వి.శ్రీ‌దేవి, కార్య‌వ‌ర్గ స‌భ్యులుగా ఎస్‌.ఎల్లారెడ్డి, శ్రీ‌రాందత్‌,ఆర్‌.గంగాధ‌ర్‌, అంబ‌దాస్ రాజేశ్వ‌ర్‌, వై.శ్రీ‌నివాస్‌రెడ్డి, టి.వెంక‌టేష్‌, డి.శ్రీ‌ధ‌ర్‌, దూలం మ‌ధు, కోమ‌ల్‌రెడ్డి ఎన్నిక‌య్యారు. స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌(విశ్రాంత‌) ర‌వీంద్ర‌బాబు ఎన్నిక‌ల ఇంఛార్జీగా వ్య‌వ‌హ‌రించారు.