విధాత, హైదరాబాద్ : పోరాటాలతో సాధించుకున్న తెలంగాణను పోలీసు రాజ్యంగా మార్చొద్దని ప్రభుత్వానికి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజున శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు సివిల్ లా బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లుపై చర్చను ప్రారంభించిన కేటీఆర్ మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమర్థిస్తూ, స్వాగతిస్తున్నామని తెలిపారు. న్యాయ వ్యవస్థపైన ప్రజలందరికీ ఒక అపారమైన నమ్మకం, విశ్వాసం ఉందని, అయితే ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే.. అంత అన్యాయం జరిగినట్లేనన్నారు. రాజకీయంగా విబేధాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థను కాపాడేందుకు సమిష్ఠిగా కలిసి పని చేయాలన్నారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్, అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. అత్యాచారాలు, సైబర్ క్రైమ్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అవసరమైతే ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలి. దీంతో మిగతా వారెవ్వరూ కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడరని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం కొన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చిందని, ఆ చట్టాలతో రాష్ట్రానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ముందు కొత్త చట్టాలపై ప్రభుత్వ వైఖరి ఏంటో తెలియజేయాలని ప్రశ్నించారు.కొత్త చట్టాల వల్ల తెలంగాణ పోలీసు రాజ్యంగా మారుతుందా అనే సందేహం ఉందన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను కర్ణాటకలో, పశ్చిమ బెంగాల్‌లో, తమిళనాడులో కొంత మార్పులు చేర్పులు చేసి పోలీసు రాజ్యం కాకుండా పౌరసమాజానికి కొన్ని హక్కులు ఉండేలా సవరణలు చేశారని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలన చేయాలన్నారు. ప్రజల భావ స్వేచ్ఛకు అంటంకం కలుగకుండా చూడాలన్నారు. కొట్లాడి సాధించిన తెలంగాణను పోలీసు రాజ్యంగా మార్చొద్దని ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు.