KTR : హైదరాబాద్ ప్రగతి మరింత ముందుకు

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారిన హైదరాబాద్ త్వరలోనే బెంగళూరును అధిగమించి మొదటి స్థానానికి వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు.

KTR

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగరం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారిందని..ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం త్వరలోనే బెంగళూరును అధిగమించి మొదటి స్థానానికి వస్తుందని ఆశిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన జీసీసీ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారడం వెనక గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఎంతగానో ఉందన్నారు. పది సంవత్సరాలపాటు అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో హైదరాబాద్‌ నగరాన్ని సమగ్రంగా తీర్చిదిద్దడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తుల ఆధారంగా కాకుండా శాశ్వతంగా మంచి ఫలితాలు వచ్చేలా వ్యవస్థలను, చట్టాలను, సంస్కరణలను తీసుకురావడం వలన తెలంగాణ వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది అని తెలిపారు. అందుకే బ్యాంకింగ్, ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ ఇవన్నీ రంగాల్లో భారీగా పెట్టుబడులను, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించగలిగిందన్నారు.

హైదరాబాద్‌లో అనేక అవకాశాలు ఉన్నాయని… వీటన్నింటినీ ఉపయోగించుకొని మరింత పెట్టుబడులు వచ్చేలా తమ తమ పరిధిలో కృషి చేయాలని చార్టెడ్ అకౌంటెంట్‌లకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న సంస్కరణల యుగంలో ఆర్థిక కార్యకలాపాల పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న చట్టాల నేపథ్యంలో చార్టెడ్ అకౌంటెంట్ల ప్రాధాన్యత బాగా పెరిగిందని, వీరంతా దేశంలో డిజిటల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్‌కు సంబంధించిన రంగంలో కీలకంగా మారారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావాలని ఎల్లప్పుడూ కోరుకుంటామన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరింత కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.