మొగోన్ని కనుకనే హుస్నాబాద్ వెళ్లి గెలిచా: మంత్రి పొన్నం ప్రభాకర్

"ప్రధాని నరేంద్ర మోడీ స్వస్థలం గుజరాత్ అయితే వారణాసిలో పోటీ చేసి గెలవలేదా? నేను మోగొన్ని కాబట్టే పక్క నియోజకవర్గానికి వెళ్లి పోటీ చేసి గెలిచా"..

  • Publish Date - April 19, 2024 / 07:40 PM IST

*లోకసభ ఎన్నికల్లోనూ
అక్కడ మెజారిటీ ఓట్లు
తీసుకువస్తా..

విధాత బ్యూరో, కరీంనగర్: “ప్రధాని నరేంద్ర మోడీ స్వస్థలం గుజరాత్ అయితే వారణాసిలో పోటీ చేసి గెలవలేదా? నేను మోగొన్ని కాబట్టే పక్క నియోజకవర్గానికి వెళ్లి పోటీ చేసి గెలిచా”… కరీంనగర్ నుండి పక్క నియోజకవర్గానికి పారిపోయాడంటూ బీఆర్ఎస్, బిజెపి నేతలకు ఇలా ఘాటుగా సమాధానం ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడవకముందే కూలిపోతుందని శాపనార్ధాలు పెడుతున్నారు, దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండని సవాలు విసిరారు.

శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థిత్వాలు ఖరారైన తరువాత కూడా ఫోన్ టాపింగ్, ఢిల్లీ మధ్యాహ్నం కేసు, అనేక కుంభకోణాల కారణంగా బీఆర్ఎస్ నుండి పోటీ చేయడానికే నేతలు వెనుకంజ వేస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

కరీంనగర్ లోకసభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో, మెజార్టీ ఓట్లు తీసుకువస్తామని తమ పార్టీ నేతలు చెబుతున్నారని, అలాగే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ లో కూడా పార్టీ అభ్యర్థికి మెజార్టీ ఓట్లు తెచ్చి పెడతానని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో 60 కోట్లు అప్పు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు.
చెల్లించాల్సిన బిల్లులే 40 వేల కోట్ల వరకు ఉన్నాయని చెప్పారు.
శాసనసభ ఎన్నికల ముందు ఇష్టారీతిన ప్రోసిడింగ్స్ ఇచ్చారని,అవే లక్ష కోట్ల మేరకు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రానికి ఒకేఒక్క టెక్స్ టైల్ పార్కు మంజూరు అయితే,దానిని చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న సిరిసిల్ల ప్రాంతానికి కాకుండా వరంగల్ కి తీసుకు వెళితే, పార్లమెంట్ సభ్యునిగా బండి సంజయ్ ఆపలేకపోయారన్నారు.
ఇప్పుడు నేతన్నల గురించి ఆయన లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చేనేతపై జిఎస్టి విధిస్తే బిజెపి నేతలు ఎందుకు వ్యతిరేకించలేదన్నారు.
చేనేత కార్మికులకు ఉపాధికి ఇబ్బందులు లేకుండా చూసేందుకు యార్న్ పై సబ్సిడీ ఇచ్చే విషయంలో ఆలోచన చేస్తున్నామన్నారు.

లోకసభ ఎన్నికల పోలింగ్ కు మరో 20 రోజుల వ్యవధి మాత్రమే ఉందని, పార్టీ కార్యకర్తలు అందరూ కష్టించి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి బాటలు వేయాలన్నారు.
282 పోలింగ్ బూత్ లు ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల్లో 100 బూత్ లలో మెజారిటీ వచ్చిందని, ఈసారి అన్ని బూత్ లలో మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో మెజారిటీ ఓట్లు తీసుకువచ్చే నాయకులు, కార్యకర్తలకు పార్టీలో, అభివృద్ధి కార్యక్రమాల్లో తగిన గుర్తింపు ఉంటుందన్నారు.

Latest News