అమరావతి : 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మూడేళ్లలో రాజధాని అమరావతికి ఒక స్పష్టమైన రూపు తీసుకొస్తాం.. ఇలాంటి అద్భుతమైన నగరం ప్రపంచంలో మరెక్కడా నిర్మించే అవకాశం లేదు అన్నట్లుగా ఉంటుందన్నారు. రాజధాని పనులను వేగవంతం చేసి, అత్యాధునిక మౌలిక వసతులతో అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం అని చంద్రబాబు పునురుద్ఘాటించారు. రూ.440 కోట్లతో కట్టిన పోలవరం డయాఫ్రమ్ వాల్ ను గత పాలకులు ధ్వంసం చేశారు. ఇప్పుడు అదనంగా రూ.1000 కోట్ల మేర దాని నిర్మాణానికి ఖర్చు అవుతోందని…పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం అన్నారు. అమరావతి రాజధానిని శ్మశానమని, ఎడారని అన్నారు అని.. వచ్చే మూడేళ్లలో మోస్ట్ లివబుల్ సిటిగా మారుస్తాం అని తెలిపారు.
సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఐదవ బ్లాకులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై చర్చించారు. 2026-27లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఇక రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ ఇతర సాంకేతికత వినియోగంపై సమావేశంలో ప్రస్తావించారు. నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూయర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టుగా భావించాలని స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని… వాటిని నిబద్దతతో క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంటుందన్నారు. అంతా టీమ్ స్పిరిట్ తో పని చేయాలి. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా ముందుకు వెళ్లాలి. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు పాలనలో రావాలని అందరినీ కోరుతున్నాను. అవుట్ డేటెడ్, అవసరం లేని చట్టాలను సమీక్షించుకుని ముందుకు వెళ్దాం. మెరుగైన ఫలితాలు సాధించడానికి లక్ష్యాలు నిర్దేశించుకుని అంతా కలిసి పని చేద్దాం. 2026-27లో అనుకున్న లక్ష్యాలను సాధించేలా కార్యాచరణ ఉండాలి అని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 1 నుంచి పాపులేషన్ మేనెజ్మెంట్ పాలసీ
ఏప్రిల్ 1 నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తెస్తామని చంద్రబాబు వెల్లడించారు. అసెంబ్లీలో దీనిపై పాలసీ ప్రకటిస్తామన్నారు. జనాభా పెంచేందుకు ప్రోత్సహాకాలు, గర్భ నిరోధక శస్త్ర చికిత్సల నియంత్రణపై అవగాహాన కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ప్రపంచ దేశాలు వయోభారంతో కూడిన జనాభాతో ఇబ్బందులు పడుతున్నాయని, మన దేశానికి, రాష్ట్రానికి ఆ పరిస్థితి రాకుండా జనాభాను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ ప్రగతిపై త్రైమాసిక సమీక్షలు
ప్రతీ మూడు నెలలకోసారి ప్రభుత్వ ప్రగతి… పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నాం అని, ఇలా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏమేరకు చేరుకున్నామన్నదానిపై స్పష్టతతో ఉంటున్నాం అని చంద్రబాబు తెలిపారు. గడచిన 19 నెలల్లో అగాధం, అంధకారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేశాం. వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. తల్లికి వందనం ద్వారా రూ.10 వేల కోట్ల తల్లుల ఖాతాల్లో వేశాం. స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మొబిలిటి పెరిగింది… 4.29 కోట్ల మేర ఉచిత ప్రయాణాలు ఇప్పటి వరకూ జరిగాయి. ప్రస్తుతం ఉన్న బస్సులతోనే ఆక్యుపెన్సీ పెరిగింది. అన్నదాత సుఖీభవ ద్వారా రూ. 6,310 కోట్ల ఆర్ధిక సహకారం అందించాం. రాయలసీమలో హార్టి కల్చర్ హబ్, కోస్తాలో ఆక్వా కల్చర్ పెంచేలా చర్యలు చేపట్టాం. రైతు ఆత్మహత్యలనేవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం… ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే… వాటిని అధ్యయనం చేసి రైతులను ఆదుకుంటున్నాం. దీపం 2.0 ద్వారా 4 విడతల్లో 3.64 కోట్ల గ్యాస్ సిలెండర్లు ఇప్పటి వరకూ ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రూ.58 వేల కోట్ల మేర ఆర్ధిక చేయూత అందించాం. సంక్షేమ పథకాలు అవసరమా…? అనే చర్చ సరికాదు… పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమే”అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
వివాదాలు సృష్టించారు… 22ఏలో పెట్టేశారు
“రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాం. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేసింది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా డ్రైవర్లకు మేలు చేస్తున్నాం. రూ.1,100 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా రైతులను ఆదుకుంటున్నాం. ధాన్యం కొనుగోళ్లకు కూడా రూ.10 వేల కోట్ల మేర 48 గంటల్లోనే చెల్లింపులు చేశాం. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇస్తున్నాం. తాడేపల్లి ప్యాలెస్ వద్ద హెలిపాడ్ కోసం ఓ ప్రైవేటు భూమిని అక్రమంగా 22 ఏలో పెట్టేశారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఈ తరహాలో అధికారం దుర్వినియోగం చేశారు. ఇది ఒక్క తాడేపల్లిలోనే కాదు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. భూవివాదాలు లేకుండా… పకడ్బందీగా సర్వే ప్రక్రియ చేపడుతున్నాం. క్యూఆర్ కోడ్ సహా ఇతర భద్రతా ఫీచర్లతో పాస్ పుస్తకాలను అందిస్తున్నాం.
సాగునీటి ప్రాజెక్టులకు రూ.24వేల కోట్లు ఖర్చు
సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటి వరకూ రూ.24 వేల కోట్లు ఖర్చు చేశాం అని చంద్రబాబు తెలిపారు. క్వాంటం వ్యాలీకి ఇటీవలే శంకుస్థాపన చేసి అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా మారుస్తున్నాం. విశాఖలో గూగుల్‌తో పాటు ఇతర సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాయి. మొత్తం 5 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్లు రాబోతున్నాయి. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా తయారీకి కూడా కార్యాచరణ మొదలైంది. విద్యుత్ రంగంలో ట్రూ అప్ నుంచి ట్రూడౌన్ చేసే పరిస్థితికి వచ్చాం. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేశాం. 5757 మంది కానిస్టేబుళ్ల నియామకం కూడా పూర్తి చేశాం… వారి స్టైఫండ్ రూ.4500 నుంచి రూ రూ.12,500కు పెంచాం. మార్చిలోగా రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను క్లియర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
రూ.4వేల కోట్లతో రహదారులు కళ కళ
“రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేశాం..మరో రూ.3 వేల కోట్లు ఖర్చు చేసి రోడ్లను నిర్మిస్తున్నాం. పల్లె పండుగ ద్వారా రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. జీ రామ్ జీ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. జల్ జీవన్ మిషన్ పథకాన్ని గతంలో అస్తవ్యస్తం చేశారు. దాన్ని సరిదిద్ది రూ.25 వేల కోట్లతో ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు ఇస్తాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నాం, స్కూల్ కిట్లు పంపిణీ చేశాం. ఈసారి 9.88 గ్రోత్ రేట్ సాధించాం. త్వరలోనే డబుల్ డిజిట్ గ్రోత్ సాధించాలి. తలసరి ఆదాయం పెరిగేలా నిర్దుష్టమైన ప్రమాణాలను పెట్టుకున్నాం. సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ కేర్ నిర్వహించాలని నిర్ణయించాం. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఉచితంగా ఆరోగ్య భీమా కల్పిస్తున్నాం.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారం అందించటంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పడింది అని చంద్రబాబు తెలిపారు.
ఉదాసీనత వీడి పని చేయాలి: ఉప ముఖ్యమంత్రి
రాష్ట్రాభివృద్ధి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించుకుంటున్నట్టు చెప్పారు. పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల విలువైన పనులు ప్రారంభం అయ్యాయని గుర్తు చేశారు. ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి రావాలని… ఈ సేవలన్నీ ప్రజలకు చేరేలా అధికారులు పని చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. నగర వనాలతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అటవీశాఖ ద్వారా చేపడుతున్నామని వెల్లడించారు. తక్కువ ఆర్ధిక వనరులతోనే రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. నిధుల కొరత ఉన్నప్పటికీ నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉదాసీనత లేకుండా పని చేయాలని… దీనిని అధిగమించేలా మన కార్యచరణ ఉండాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ గ్యాప్స్ సవరించుకుని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్న కార్యక్రమాల్ని పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం కోరారు. ఈ సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Lagnesh Kumar | చూపులేకపోయినా.. లా చదివి ప్రాక్టీస్ చేస్తున్నాడు.. దృష్టిలోపం ఉన్న తొలి న్యాయవాదిగా..
AP bird flu| ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం..28వేల కోళ్ల మృతి
