కబ్జాదారులపై ఉక్కు పాదం

పాలమూరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు

  • Publish Date - December 11, 2023 / 01:05 PM IST

– ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు

– పాలమూరు ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం పాలమూరు మండల పరిషత్ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులను ఉద్దెశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతే రాబోవు తరానికి తీవ్ర నష్టం చేసిన వారవుతారన్నారు. మండలంలోని ఉన్నత పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, బాలికల కోసం టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పార్టీలను పక్కకు పెట్టి ప్రజలు ఇచ్చిన పదవికి న్యాయం చేసి అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయమని ఎన్నం అన్నారు.


వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, సంక్షేమం అనేది పేదవారికి ముంగిట్లోకి రావాలని కోరారు. విబేధాలు, విరోధాలు మరిచి ప్రజలకు అవసరాలు తీర్చేందుకు కృషి చేద్దామన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు అందరం బాధ్యులమే అని, మంచి సంకల్పంతో ముందుకు సాగుదామని అధికారులు, నాయకులను కోరారు. రేషన్ కార్డుల డిమాండ్ ప్రజల నుంచి అధికంగా ఉందని పలువురు సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై గ్రామాల్లో తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ సుభాశ్రీ, జడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీడీఓ గోవింద రెడ్డి, ఉపాధ్యక్షురాలు అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ప్రాథమిక వ్యవసాయ శాఖ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, రైతు బంధు చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.