విధాత ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత నీరజ్ సాహు ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలో బయటపడిన అక్రమార్జన ఆపార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య ఆరోపించారు. సోమవారం స్థానికంగా పార్టీ జిల్లా కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదు రోజులుగా కాంగ్రెస్ ఎంపీ సాహు ఇంట్లో ఐటీ అధికారుల దాడి అనంతరం రూ.350 కోట్లు బయటపడిందని, దీనిపై కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు ఖర్గే కానీ నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాలకు డబ్బు పంపకాలతో ఎన్నికల్లో గెలవాలన్న కుట్ర బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు, స్కాములకు నిలయమని, ఈ డబ్బు కట్టలు వెలుగు చూడటం నిదర్శమని అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోడీ నీతివంతమైన పాలనతో రానున్న ఎన్నికల్లో 400 పైబడి సీట్లు ఖాయమని అన్నారు. నిజామాబాద్ అర్బన్ లో రానున్న కాలంలో అవినీతికి తావులేని పాలన సాగుతుందని తెలిపారు.