ప్రధాని మోదీపై ఓవైసీ బ్రదర్స్ ఫైర్

ముస్లిం మైనార్టీల పట్ల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు హిట్లర్ మాట్లాడినట్లుగా ఉందని ఎంఐఎం చీఫ్ అసదుద్ధిన్ ఓవైసీ, ఆయన సోదరుడు ఎమ్మెల్యే అక్బరుద్ధిన్ ఓవైసీలు తప్పుబట్టారు

  • Publish Date - April 23, 2024 / 03:23 PM IST

విధాత, హైదరాబాద్‌ : ముస్లిం మైనార్టీల పట్ల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు హిట్లర్ మాట్లాడినట్లుగా ఉందని ఎంఐఎం చీఫ్ అసదుద్ధిన్ ఓవైసీ, ఆయన సోదరుడు ఎమ్మెల్యే అక్బరుద్ధిన్ ఓవైసీలు తప్పుబట్టారు. మంగళవారం వారు ప్రధాని వ్యాఖ్యలపై వేర్వేరుగా స్పందించారు. అసదుద్ధిన్ మాట్లాడుతూ ప్రధాని దేశ ప్రధానిగా మాట్లాడుతున్నట్లుగా లేదని హిట్లర్ మాట్లాడినట్లుగా ఉందన్నారు. గల్లీ లీడర్ మాదిరిగా ప్రధాని మట్లాటడం సరికాదన్నారు. దేశంలో 17కోట్ల మంది ఉన్న ముస్లిం జనాభా పట్ల ఆయన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని విమర్శించారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని, హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతారంటూ ప్రధాని విద్వేషపూరకంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రధాని మోదీకి కూడా ఆరుగురు అన్నదమ్ములున్నారని, అమిత్ ఆషాకు ఆరుగురు అక్కా చెల్లెళ్లు ఉన్నారని, రవిశంకర్ ప్రసాద్‌కు ఏడుగురు సోదరిసోదరులు ఉన్నారన్నారు. ముస్లిలు ఎవరి ఆస్తులు దోచుకున్నామో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. పదేపదే దేశంలోని ముస్లింలు అక్రమంగా చొరబడుతున్నారంటున్నారని మరి మీరు అడ్డుకోకుండా చాయ్ తాగుతు కూర్చున్నారా అంటూ ఎద్దేవా చేశారు. దేశంలోని ముస్లింలు తాతలు సంపాదించినంత సంపాదించడం లేదని, అదే హిందూ సోదరులు చాల మంది తాతల కంటే ఎక్కువే సంపాదిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ ముస్లింల పట్ల విద్వేషపూరిత అబద్ధాలను ప్రచారం చేయడం కంటే దమ్ముంటే లడాక్‌లో చైనా చేసిన నిర్మాణాలపై మాట్లాడాలని సవాల్ చేశారు.

దేశాన్ని అలంకరించాం..చొరబాటుదారులం కాదు

ముస్లింలు చొరబాటుదారులు కాదని, దేశాన్ని తాజ్ మ‌హ‌ల్‌, ఖుతుబ్ మినార్‌, రెడ్ ఫోర్ట్‌, జామా మ‌సీదు, చార్‌మినార్ వంటి నిర్మాణాలతో అద్భుతంగా అలంకరించినవారమని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధిన్ ఓవైసీ అన్నారు. ప్రధాని మోదీ ముస్లిం జనాభా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తాము చొర‌బాటుదారుల‌మ‌ని, ఎక్కువ మంది పిల్ల‌ల్ని కంటామ‌ని ప్ర‌ధాని మోదీ విమ‌ర్శించడం విద్వేషపూరితంగా ఉందన్నారు. మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయికి ఏడు మంది సోద‌ర‌సోద‌రీమ‌ణులు ఉన్నార‌ని, యోగి ఆదిత్య‌నాథ్ ఇంట్లో కూడా ఏడు మంది ఉన్నార‌ని, అమిత్ షా ఇంట్లో కూడా ఏడు మంది ఉన్నార‌ని, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఆరు మంది సోద‌రులు ఉన్నార‌ని అక్బ‌రుద్దీన్ గుర్తు చేశారు. తామంతా ఈ దేశ పౌరులమని, ఇది త‌మ దేశ‌మ‌ని, ఎప్ప‌టికీ త‌మ‌దే అవుతుంద‌ని అక్బ‌రుద్దీన్ తెలిపారు.

Latest News