పోరాటాలు, గెలుపోటములు కొత్త కాదు

పోరాటాలు, గెలుపోటములు కొత్తేమీ కాదని నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు

  • Publish Date - December 11, 2023 / 02:24 PM IST

– అభివృద్ధికి భారీ నిధులు తెచ్చా

– అజ్ఞానంతో తప్పుడు కేసులు పెడుతున్నారు

– నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పోరాటాలు, గెలుపోటములు కొత్తేమీ కాదని నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేటలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో ఒక్కసారి గెలిచి అనేక నిధులు తెచ్చానన్నారు. మీ బిడ్డగా, మీలో ఒకడిగా నేను పడ్డ కష్టం ఏంటో, నేను తీసుకువచ్చిన పథకాలు ఏంటో మీ అందరికి తెలుసన్నారు. ప్రత్యేకంగా నియోజకవర్గ రైతుల కోసం 50 శాతం సబ్సిడీ కింద వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రూ.75 కోట్ల నిధులను రాజకీయాలకతీతంగా తీసుకొచ్చినన్నారు.


నేను తెచ్చినవన్నీ దొంగ జీవోలని, మీ స్వంత మండలమైన చెన్నరావుపేట కాంగ్రెస్ పార్టీతో నాపై కేసు పెట్టించావు.. ఇంత దిగజారుడు రాజకీయాలు కొత్త ఎమ్మెల్యేకు తగవన్నారు. ప్రభుత్వం ఎక్కడైనా దొంగ జీవోలు ఇస్తదా? దొంగ జీవోలైతే, మీ కాంగ్రెస్ పార్టీ రైతులకు లబ్ధి ఎలా జరిగింది, సబ్సిడీ ఎలా వచ్చింది.. కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా? మరి వాళ్లపై కూడా కేసు పెడతారా? వచ్చిన రూ.700 కోట్ల నిధులను వెనుక్కు పంపే కుట్ర చేస్తారా? 20 వేల మంది రైతుల నోటి దగ్గర బువ్వను కాలరాసి ఈ పథకాన్ని ఆపాలని చూస్తున్నారంటూ విమర్శించారు. 30 ఏండ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా, ఎవరి మీద నేను తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, రూ.700 కోట్ల నిధులు తీసుకువచ్చానన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మాటిస్తున్నాను… కచ్చితంగా మళ్లీ నియోజకవర్గంలో ప్యానల్ పెడతానని ప్రకటించారు. ఈ సమావేశంలో నర్సంపేట నియోజకవర్గ క్లస్టర్ బాధ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.