Site icon vidhaatha

Journalist Swetcha | ‘స్వేచ్ఛ’ చావును ఏ రోజు కోరుకోలేదు.. నేను నిర్దోషిని : పూర్ణ‌చంద‌ర్ రావు

Journalist Swetcha | హైద‌రాబాద్ : ప్ర‌ముఖ మ‌హిళా జ‌ర్న‌లిస్ట్, క‌వ‌యిత్రి స్వేచ్ఛ( Journalist Swetcha ) శుక్ర‌వారం రాత్రి ఆత్మ‌హ‌త్య( Suicide ) చేసుకున్న సంగ‌తి తెలిసిందే. స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్‌రావే( Purnachander Rao ) కారణమని.. అతణ్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతురాలి తండ్రి శంకర్‌ చిక్కడపల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని ప్ర‌జా సంఘాలు, మేధావులు, క‌వులు సోష‌ల్ మీడియా ద్వారా త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో స్వేచ్ఛ ఆత్మ‌హ‌త్య విష‌యంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పూర్ణ‌చంద‌ర్ రావు ఐదు పేజీల లేఖ‌ను విడుద‌ల చేశారు. స్వేచ్ఛ‌తో 2009 నుంచి త‌న‌కు ప‌రిచ‌యం ఉంద‌ని, 2020 నుంచి త‌న‌కు ద‌గ్గ‌రైంద‌ని పూర్ణ‌చంద‌ర్ రావు పేర్కొన్నాడు. రెండో వివాహం ద్వారా స్వేచ్ఛ‌కు పాప జ‌న్మించింది. 2022లో తన కుమార్తె అరణ్యను కూడా తన వద్దకే తెచ్చుకుందని తెలిపాడు. నా లాంటి జీవితం నా పాపకు రాకూడదు, నేనే దగ్గరుండి చూసుకోవాలని స్వేచ్ఛ ఎప్పుడూ చెప్పేది. 2022 నుంచి పాప బాధ్యతలను దాదాపు నేనే తీసుకున్నాను. ఆమె చదువు, ఇతర అవసరాలను ఒక తండ్రి స్థానంలో ఉండి చూసుకున్నాను అని పూర్ణచందర్ లేఖలో వెల్లడించాడు. స్వేచ్ఛ ఆత్మ‌హ‌త్య కేసులో తాను నిర్దోషిని అని ఆయ‌న తెలిపాడు.

పూర్ణ‌చంద‌ర్ రావు ఐదు పేజీల లేఖ సారాంశం ఇదే..

మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ స‌మాజానికి పూర్ణ‌చంద‌ర్ స్వ‌యంగా చేస్తున్న విన్న‌పం. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ స్వేచ్ఛ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం గురించి నేను ఖ‌చ్చితంగా చెప్పుకోవల‌సిన కొన్ని నిజాలు – నేను మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు చెప్ప‌లేని స్థితిలో అబ‌ద్దం తెలంగాణ మొత్తం చుట్టేస్తుంద‌ని భ‌యం.

స్వేచ్ఛ నాకు 2009 నుంచి ప‌రిచ‌యం. మేము ఇద్ద‌ర‌ము టీ న్యూస్‌లో ప‌ని చేసేవాళ్లం. టీ న్యూస్‌లో మాకు(మేము) స్నేహితులుగా ఎన్నో విష‌యాలు షేర్ చేసుకునే వాళ్లం. వాళ్ల త‌ల్లిదండ్రులు జ‌న‌శ‌క్తిలో ప‌ని చేస్తూ 6 నెల‌ల వ‌య‌సు ఉన్న స్వేచ్ఛ‌ను వారి అన్న‌వ‌దిన‌ల‌కు వ‌దిలేసి సంవ‌త్స‌రానికి ఒక‌సారి చుట్టంచూపుగా వ‌చ్చిపోయి, స్వేచ్ఛ‌ను వ‌దిలేసిన త‌ల్లిదండ్రుల గురించి ఎన్నోసార్లు చెప్పుకొని బాధ‌ప‌డ్డ సంద‌ర్భాలు నేను గుర్తు చేసుకుంటున్నా ఈ సంద‌ర్భంగా.

స్వేచ్ఛ త‌ర్వాత వివిధ ప్ర‌ముఖ చాన‌ళ్ల‌లో జ‌ర్న‌లిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించిన త‌ర్వాత నేను ఎంతో సంతోషించిన సంద‌ర్భాలు ఉన్నాయి. దుర‌దృష్ట‌వ‌శాత్తు 2008 నుంచి 2009 మ‌ధ్య కాలంలో మొద‌టి వివాహంలోఓ విడాకులు మ‌రియు 2016 నుంచి 2017 ప్రాంతంలో రెండో వివాహంలో విడాకులు తీసుకున్న స్వేచ్ఛ ఏ రోజు కూడా జీవితంలోఓ సంతృప్తిగా ఉన్న సంద‌ర్భాలు లేవు. ఆమె సంతోషాన్ని ప్ర‌జ‌ల‌కు అందించే వార్త‌ల్లో వెతుక్కుంది. రెండో వివాహం ద్వారా త‌న‌కు క‌లిగిన పాప అర‌ణ్య‌లో వెతుకున్న‌ది. త‌న బాధ‌ను రాత‌ల రూపంలో తెలియ‌జేసిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు.

2009 నుంచి స్నేహితురాలిగా మాత్ర‌మే ప‌రిచ‌యం ఉన్న స్వేచ్ఛ‌, 2020 నుంచి నాకు ద‌గ్గ‌రైన మాట వాస్త‌వ‌మే. 2017 రెండో వివాహం ద్వారా జ‌రిగిన విడాకుల త‌ర్వాత హైద‌రాబాద్ రాంన‌గ‌ర్‌లో వారి త‌ల్లిదండ్రుల‌తో ఉంటూ పూర్తి డిప్రెష‌న్‌లోకి వెళ్లిన మాట వాస్త‌వ‌ము. వారి త‌ల్లిదండ్రులు ఇరువురు జ‌న‌శ‌క్తిలో గ‌తంలో ప‌ని చేస్తూ, వారి నాన్న సానుభూతిప‌రునిగా, అమ్మ మ‌హిళా సంఘాల‌లో ప‌ని చేస్తూ, ఏ రోజు స్వేచ్ఛ‌కు వారు అమ్మ‌నాన్న‌ల ప్రేమ‌ను అందించిది లేదు. వారు ఇరువురు పెట్టుకునే గొడ‌వ‌ల‌తో రాంన‌గ‌ర్ ఇంట్లో ఉండ‌లేక‌పోతున్నా అని నాతో చెప్పుకున్న సంద‌ర్భాలు నా క‌ళ్ల ముందు మెదులుతున్నాయి.

చివ‌రికి 2020 సంవ‌త్స‌రంలో త‌ల్లిదండ్రుల‌తో ఉండ‌లేక క‌వాడిగూడ‌లో త‌ను స్వంతంగా అద్దెకు ఇల్లు తీసుకుని, 2022 ప్రాంతంలో త‌న పాప‌ను కూడా వారి త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర నుంచి త‌న వ‌ద్ద‌కు తెచ్చుకున్న‌ది. ప్ర‌తి సారి ఒక్క‌టే బాధ వ్య‌క్త‌ప‌రిచేది, నాలాంటి జీవితం నా పాప‌కు రాకూడ‌దు. నా పాప‌ను త‌ల్లిగా నేనే ద‌గ్గ‌రుండి చూసుకోవాలి అని చెప్పేది.

2022 నుంచి దాదాపు పాప భ‌విష్య‌త్‌ను పూర్తిగా నేనే తీసుకున్నాను. ఆమె చ‌దువు, ఆమెకు కావాల్సిన అన‌ని అవ‌స‌రాల‌ను దాదాపు ఒక తండ్రి స్థానంలో బాధ్య‌త తీసుకున్నాను. పోయిన సంవ‌త్స‌రం అర‌ణ్య మేచుర్ అయిన‌ప్పుడు స్వేచ్ఛ బాధ‌ప‌డ‌కుండా అర‌ణ్య బాధ‌ప‌డ‌కుండా నా స్వంతంగా 5 ల‌క్ష‌ల రూపాయాలు ఖ‌ర్చు చేసి ఫంక్ష‌న్ చేయ‌డం జ‌రిగింది. ఆమె గ‌త ఐదు సంవ‌త్స‌రాల నుంచి డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి అంగ్జైటి, ఎమోష‌న‌ల్ టెండెన్సిస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ఎన్నోసార్లు హాస్పిట‌ల్స్‌కు తీసుకెళ్లాను, స్కానింగ్స్ మెడిక‌ల్ రిపోర్ట్స్ అన్ని కూడా క‌వాడిగూడ త‌న రూంలో ఉన్నాయి.

అర‌ణ్య పాప న‌న్ను పూరి అని ముద్దుగా పిలిచేది. స్వేచ్ఛ నా దృష్టిలో అన్ని ఉన్న అనాథ‌. అమ్మ‌, నాన్న 6 నెల‌ల వ‌య‌సులో వ‌దిలేశారు. రెండు పెళ్లిళ్ల ద్వారా త‌న‌కు మోసం జ‌రిగింది. రెండు పెళ్లిళ్ల విడాకుల త‌ర్వాత, త‌న పాప‌తో జీవితంలో పూర్తిగా డిప్రెష‌న్‌లోనే ఉంది. స్వేచ్ఛ అనాథ‌లాగా బాధ‌ప‌డ‌కూడ‌దు, స్వేచ్ఛ మ‌రియు అర‌ణ్య సంతోషంగా ఉండాల‌నేదే నా ఉద్దేశ్యం. నేను అదే కోరుకున్నా. త‌న పాప అర‌ణ్య నా పాప అయిపోయింది. పూర్తి బాధ్య‌త తీసుకున్నా.. ఉప్ప‌ల్‌లోని కేంద్రీయ విద్యాల‌యంలో పాప‌ను జాయిన్ చేయించాను, ఫీజులు క‌డుతూ వ‌స్తున్నా ఇప్పుడు అర‌ణ్య పాప 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ది.

నాకు స్వేచ్ఛ‌కు అర‌ణ్య‌కు ఎలాంటి విబేధాలు లేవు. మీడియా ద్వారా అర‌ణ్య పాప మాట‌లు న‌న్ను బాధించాయి. ఈ నెల‌లోనే స్వేచ్ఛ ఆమె స్వ‌త‌హాగా దేవుడిని పెద్ద‌గా న‌మ్మ‌క‌పోయినా, ఒక‌సారి అరుణాచ‌లం తీసుకెళ్ల‌మ‌ని కోరితే తీసుకెళ్లాను. సంతోషంగా గ‌డిపింది. సంఘ‌ట‌న జ‌రిగే ముందు రోజు స్వేచ్ఛ వాళ్ల నాన్న‌, స్వేచ్ఛ మ‌రియు అర‌ణ్య ఉంటున్న ఇంటికి వ‌చ్చి, స్వేచ్ఛ విష‌యం చెప్ప‌గానే అత‌ను అన్న మాట‌లు స్వేచ్ఛ‌ను పూర్తిగా బాధించాయి. ఆమెను పూర్తిగా అవ‌మానించాడు వాళ్ల నాన్న‌.

రెండు సంవ‌త్స‌రాల‌కొక‌సారి ఒక మ‌నిషిని తీసుకువ‌చ్చి మీ అల్లుడు అని ప‌రిచ‌యం చేస్తే నేను త‌ల‌దించుకోవాల్సి వ‌స్తుంది. నాకు డబ్బు లేక‌పోవ‌చ్చు కానీ పీడీఎస్‌యూలో ప‌ని చేశాను. గౌర‌వాన్ని కోల్పోను అని స్వేచ్ఛ వాళ్ల నాన్న చేసిన అనుచిత‌, అగౌర‌వ వ్యాఖ్య‌లు ఆమెను చాలా బాధించాయి. నాకు చెప్పుకొని ఏడ్చింది. నేను ఇదే విష‌యం వాళ్ల అన్న‌వ‌దిన‌ల‌తో ప్ర‌స్తావించాను. అలా మాట్లాడ‌డం త‌ప్పే అని వాళ్లు కూడా అన్నారు. నేను స్వేచ్ఛ మ‌రియు అర‌ణ్య‌ను చూసుకున్న విధానం వారి బంధువులు అంద‌రికీ తెలుసు. స్వేచ్ఛ త‌న ప్ర‌తి సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లో స్వేచ్ఛ పూర్ణ‌చంద‌ర్ అని రాసుకుంది. న‌న్ను భ‌ర్త‌గా ఊహించుకుంది. పెళ్లి చేసుకోమంది. నేను స్వేచ్ఛ‌, అర‌ణ్య‌ల‌ను బాగా చూసుకున్నా, స్వేచ్ఛ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని ఇచ్చాను. ఏ రోజు ఆమె చావును నేను కోరుకోలేదు. మీడియా ముందు వారి అమ్మ‌నాన్న‌లు, బంధువులు చేస్తున్న ఆరోప‌ణ‌లు అబ‌ద్ధం. నేను ఏ రోజు పెళ్లి పేరుతో మోసం చేయ‌లేదు. ఒత్తిడి చేయ‌లేదు. నేను ఈ లేఖ రాయ‌క‌పోతే తెలంగాణ స‌మాజం అబ‌ద్దం నిజం అనుకునే ఆస్కారం ఉన్న‌ది.

చిన్న‌ప్ప‌టి నుంచి క్ర‌మ‌క్ర‌మంగా ఆమెను అవ‌హించిన ఒంటరి త‌నానికి, ఆమె మాన‌సిక స్థితికి నేను కార‌ణం కాదు. పోలీసు వాళ్లు నా కుటుంబ స‌భ్యుల‌ను పోలీసు స్టేష‌న్‌కి పిలిపించి బెదిరించి, పూర్ణ‌చంద‌ర్ వ‌చ్చే వ‌ర‌కు మీరు పోలీసు స్టేష‌న్‌లోనే ఉండాలి అని చేసిన విధానం న‌న్ను బాధించాయి. నేను నిర్దోషిని.. కోర్టుల‌లో చెప్పే నిజాలు ప్ర‌జ‌ల‌కు తెలియ‌వు. అందుకే మీడియాను ఆశ్ర‌యించాను.

LAW WILL TAKE ITS OWN COURSE
To BELIEVE IN LAW AS A LAW ABIDING CITIZEN

 

Exit mobile version