వన సమారాదన వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ : కార్తీక వన భోజనాలు ఆధ్యాత్మిక చింతనతో పాటు వన సంరక్షణ సందేశాన్నిమానవాళికి చాటిచెబుతాయని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్‌లో సంతోషి మాతా రూపాదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్‌లో కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన సభ్యులు జగదీష్ రెడ్డి, శివ లింగాలతో మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శివలింగాలకు భక్తులు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశసంస్కృతి ,సంప్రదాయాలను, హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నామన్నారు. ఇందులో భాగమే కార్తీక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం అన్నారు. భారతీయ ఆయుర్వేదంలో వృక్ష జాతికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజించి, వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతోందన్నారు. వనభోజనాల మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. మానవ మనుగడకు వనాలు చేసే మేలు అంతా ఇంతా కాదన్నారు. భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వన సమారాధన అందిస్తోందన్నారు. కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆటలు , పాటలు కబుర్లకు ఇది చక్కటి వేదిక అన్నారు. పిల్లలు, పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే క్రీడలు, నృత్యాలు, సంగీత కచేరీలు నిర్వహించడానికి మంచి అవకాశం అన్నారు.