విధాత, హైదరాబాద్ : విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం అని గత ప్రభుత్వ పాలనపై గొప్పలు చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘అబద్ధాల పునాదుల మీదనే అధికారంలోకి వచ్చి, అబద్ధాల పథకాలను సాగించిన పార్టీ ఇంకా అబద్ధాలతోనే ప్రజలను మభ్యపెడుతున్నది’ అని మండిపడ్డారు. సెంట్రల్ ఏజెన్సీ అథారిటీ వార్షిక నివేదిక మేరకు తెలంగాణ తలసరి వినియోగంలో పదవ స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ స్వయంపాలనలో కూడా ప్రాణహిత చేవెళ్ల ఎందుకు పూర్తి కాలేదో గత పాలకులు చెప్పాలన్నారు. ఉమ్మడి పాలనలో వడ్డించే వాళ్లు మనవాళ్ళు కాక వివక్ష ఎదురైతే తెలంగాణలో ఎందుకు వివక్ష ఎదురయిందని ప్రశ్నించారు.
ఆనాడు పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించకపోయి ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉండేదని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న మీరు మొట్టమొదట పాలమూరు బిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీ ప్రాంత అల్లుడినంటూ చెప్పుకొన్న కేసీఆర్ పాలనలో మిడ్ మానేరు ముంపు బాధితులకు పదేళ్లుగా న్యాయం జరుగలేదని, కుటుంబ సభ్యుడైన ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు 250 గజాలను ఆర్‌ఆండ్‌ఆర్ ప్యాకేజీ కింద పట్టా తీసుకున్నాడని వెల్లడించారు.
సమైక్య పాలనలో జరిగిన తప్పిదాలపై ఇప్పుడున్న మమ్మల్ని నిలదీయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలని కోరారు. ఎవరి మాటల్లో న్యాయం ఉందో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వ్యాక్సిన్‌లను అమ్ముకున్న వ్యాపారులకు రాజ్యసభ సీట్లు అమ్ముకున్న వారు తమ పార్టీ టికెట్లపై మాట్లాడటం విడ్డూరమని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాధన కోసం డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలేసిన నళినికి ఉద్యోగం ఇవ్వని కేసీఆర్.. ఎంపీగా ఓడిన బిడ్డకు వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారని విమర్శించారు.