TG Weather Update | తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. శనివారం దక్షిణ ఆంధ్రప్రదేశ్ సమీపంలో బంగాళాఖాతం తీరంలో ఏర్పడిన ఆవర్తం కొనసాగుతుందని వాతావరణ విభాగం పేర్కొంది. ఈ క్రమంలో సోమవారం నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మంగళవారం కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ నెల 12 వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడుతాయని.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో కూడిన వానలు కురుస్తాయని వివరించింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీచేసింది. గడిచిన 24గంటల్లో నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం నమోదైంది.