నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని కొల్లాపూర్‌లో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. కొల్లాపూర్‌కు సమీపంలోని అమరగిరి తీరంలోని కోతిగుండు, పాతబొల్లారం, సోమశిల, తదితర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తుందని అటవీశాఖ రేంజ్ అధికారి శరత్ చంద్రారెడ్డి తెలిపారు.
కోతిగుండు ప్రాంతంలో కృష్ణా నదిలో నీళ్లు తాగడానికి వచ్చిన పెద్దపులి కదలికలను వారం రోజుల క్రితం మత్స్యకారులు వీడియో తీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ కావడంతో, సోమవారం అటవీ అధికారులు అప్రమత్తమైన నల్లమలలోని కృష్ణా నది తీర ప్రాంతాలను పరిశీలించారు. పెద్దపులి కదలికలపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
కృష్ణా నది తీర ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి కదలికలను గమనించాలని సూచించారు. పులి కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇక కొల్లాపూర్ రేంజ్‌లో 7 పెద్ద పులులు, 2 చిన్న పిల్లలు ఉన్నాయని తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 22 పెద్ద పులులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 30కి పెరిగి ఉండొచ్చని మద్దిమడుగు రేంజ్ అధికారి ఆదిత్య పేర్కొన్నారు.