హైదరాబాద్, అక్టోబర్ 13(విధాత): ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలులో చేపడుతున్న సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఖైదీలకు బీమా సౌకర్యం కల్పించడంతోపాటు, వారి కుటుంబ సభ్యులకు వడ్డీలేకుండా రుణ సదుపాయం కల్పించడం అభిందనీయమన్నారు. మహిళా ఖైదీల పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదవిస్తూ ఫీజులను కూడా జైళ్ల శాఖ చెల్లించడం గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్ ను అభినందించకుండా ఉండలేమన్నారు. కస్టడీ-కేర్-కరక్షన్ కు సౌమ్య మిశ్రా నిజమైన ఆచరణ రూపమిస్తున్నారని చెప్పారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం చర్లపల్లి జైలును సందర్శించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. చర్లపల్లి జైలులో చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ఇండస్ట్రీలను, వారు తయారు చేస్తున్నఉత్పత్తులను అడిగి తెలుసుకున్నారు. గోశాలను సందర్శించారు. గోవులకు స్వయంగా తన చేతితో మేత తిన్పించారు. ఒక లేగ ఆవుకు ‘క్రిష్ణ’ అంటూ నామకరణం చేశారు. జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన రిక్రియేషన్ క్లబ్, బంతి పూల వనాన్ని సందర్శించారు. తేనె టీగలతో తేనె ఏ విధంగా పడుతున్నారనే విషయాన్ని స్వయంగా తిలకించారు.
అనంతరం ఖైదీల కోసం జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణలను కేంద్ర మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. 25 ఏళ్ల క్రితం చర్లపల్లి జైలును నిర్మించారని నాటి నుండి నేటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చర్లపల్లి జైలు అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ.11.60 కోట్లు మంజూరు చేయగా, రూ. 11.30 కోట్లు ఖర్చు చేసి వివిధ పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, చర్లపల్లి జైలు సూపరింటెండ్ శివకుమార్ గౌడ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.