Komatireddy Raj Gopal Reddy : మద్యం వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

మునుగోడులో మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాక్. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

Komatireddy Raj Gopal Reddy

నల్లగొండ, విధాత: మునుగోడు నియోజకవర్గంలో లిక్కర్ మద్యం సిండికేట్ వ్యాపారులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త మద్యం పాలసీ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు లిక్కర్ వ్యాపారులకు సవాల్ గా మారాయి. “రాజన్న రూల్స్..” పాటించాల్సిందేనని క్యాడర్ అంటోంది. వైన్ షాప్స్ నిర్వాహకులు.. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని రాజగోపాల్ రెడ్డి క్యాడర్ అంటున్నారు.

మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని, ఇతర మండలాల ప్రాంతాలకు చెందిన వాళ్ళు అనర్హులని వెల్లడించారు. వైన్ షాప్ లు ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలని, ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవన్నారు. వైన్స్‌లకు అనుబంధంగా (సిట్టింగ్) పర్మిట్ రూమ్ ఉండవద్దని తెలిపారు. ముఖ్యంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దని, లాటరీ విధానంలో వైన్స్ షాప్ లు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదని,మునుగోడు రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ తో సంబంధం లేదన్నారు.

మునుగోడు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం.. బెల్టు షాప్ ల నిర్మూలన, మహిళల సాధికారతే మా ఉద్దేశమని ఎమ్మెల్యే ఫాలోవర్స్ అంటున్నారు. ఈ రూల్స్ పాటించని వారు టెండర్లు వేయవద్దు.. నిబంధనలు అతిక్రమించి ఇబ్బందులు పడవద్దు అంటూ సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి ఫాలోవర్స్ మెసేజులు వైరల్ చేస్తున్నారు.