విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : చట్ట పర పాలనతో పాలమూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. స్వేచ్ఛగా జీవించే హక్కు ను రాజ్యాంగం కల్పించిందని, ఈ రోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలకతీతంగా సమస్యలు పరిష్కారం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నిన్నటి వరకే రాజకీయాలని, ఇక నుంచి నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రతికార చర్యలు వంటివి తన ఉదేశ్యం కాదని, కావాలని సమస్యలు సృష్టించిన వారికి చట్టపరమైన చర్యలు ఉంటాయని యెన్నం హెచ్చరించారు. మహబూబ్ నగర్ అభివృద్ధికి ఐకాన్‌గా మార్చుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలంతా ఏ సమస్య కోసమైనా స్వయంగా ఈ ప్రజా క్యాంపు కార్యాలయానికి రావాలని కోరారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని జిల్లా కలెక్టర్ రవి మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా ఇతర శాఖల అధికారులు, పోలీసు అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వినోద్ కుమార్, గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, విజయ్ కుమార్, బెక్కరి మధుసూదన్ రెడ్డి, ఆనంద్ గౌడ్, వసంత, మాజీ మున్సిపల్ చైర్మన్ రాధ అమర్ , బెక్కరి అనిత,శ లింగం నాయక్, సాయిబాబా,రాములు, సిరాజ్ ఖాద్రీ, రాజేందర్ రెడ్డి, నర్సింహరెడ్డి, టంకర కృష్ణయ్య యాదవ్, లక్ష్మణ్ యాదవ్, ఆజ్మత్ అలి పాల్గొన్నారు.