Dayaa Web Series Review | ‘దయా’ వెబ్‌సీరిస్‌ రివ్యూ.. JD చక్రవర్తి ఈజ్ బ్యాక్! అసలు మిస్ కావద్దు

Dayaa Web Series Review | వెబ్ సిరీస్ పేరు: ‘దయా’ విడుదల తేదీ: 04 ఆగస్ట్, 2023 ఓటీటీ ప్లాట్‌ఫామ్: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తారాగణం: జె.డి. చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీశన్, కమల్ కామరాజు, విష్ణు ప్రియ, జోష్ రవి, పృథ్వీరాజ్, గాయత్రి గుప్తా తదితరులు. ఛాయాగ్రహణం: వివేక్ కాలెపు సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ ఎడిటింగ్: విప్లమ్ నిర్మాతలు: మహేంద్ర సోనీ, శ్రీకాంత్ మెహతా రచన, దర్శకత్వం: పవన్ సాధినేని ఓటీటీ మాధ్యమం […]

  • Publish Date - August 7, 2023 / 01:40 PM IST

Dayaa Web Series Review |

వెబ్ సిరీస్ పేరు: ‘దయా’
విడుదల తేదీ: 04 ఆగస్ట్, 2023
ఓటీటీ ప్లాట్‌ఫామ్: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
తారాగణం: జె.డి. చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీశన్, కమల్ కామరాజు, విష్ణు ప్రియ, జోష్ రవి, పృథ్వీరాజ్, గాయత్రి గుప్తా తదితరులు.
ఛాయాగ్రహణం: వివేక్ కాలెపు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ఎడిటింగ్: విప్లమ్
నిర్మాతలు: మహేంద్ర సోనీ, శ్రీకాంత్ మెహతా
రచన, దర్శకత్వం: పవన్ సాధినేని

ఓటీటీ మాధ్యమం హవా పెరిగిన తర్వాత ప్రతి వారం సినిమాలతో పాటు కొన్ని ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు కూడా విడుదలవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు వెబ్ సిరీస్‌లపై అంత పెద్దగా దృష్టి పెట్టరు అని అంతా అనుకున్నప్పటికీ.. ఈ మధ్య వచ్చిన ‘రానా నాయుడు’తో వెబ్ సిరీస్‌లు కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సినిమాలను చూసినంత ఇంట్రెస్ట్‌గా వెబ్ సిరీస్‌లను చూడడానికి.. దానికున్న టైమ్.. అందులోని కంటెంట్ కాస్త ఇబ్బందికరంగా ఉందనే టాక్ వినిపిస్తుండటమే.

అయితేనేం.. ఈ మధ్య వెబ్ సిరీస్‌ల హవా కూడా ఓటీటీ వద్ద బాగానే వినిపిస్తుంది. ముఖ్యంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా వచ్చిన ‘సేవ్ ద టైగర్స్’, ‘సైతాన్’ మంచి ఆదరణను పొందాయి. ఇప్పుడీ ప్లాట్‌ఫామ్‌లోనే ‘దయా’ అనే వెబ్ సిరీస్ విడుదలైంది.

కొన్ని రోజులుగా ఈ వెబ్ సిరీస్‌పై జరుగుతున్న పబ్లిసిటీ.. దీనిపై ఓ చూపు వేసేలా చేసింది. టాలెంటెడ్ నటుడు జె.డి. చక్రవర్తి ఈ వెబ్ సిరీస్‌తో డిజిటల్‌లో ఎంట్రీ ఇస్తుండటంతో పాటు.. విడుదలైన టీజర్, ట్రైలర్‌లు కూడా ఆకర్షణీయంగా ఉండటంతో ఆటోమ్యాటిగ్గా ఈ వెబ్ సిరీస్‌పై క్రేజ్ పెరిగిపోయింది. మరి ఆ క్రేజ్‌కి తగినట్లుగా ఈ వెబ్ సిరీస్ ఉందో లేదో.. ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

కాకినాడ సముద్రపు ఓడరేవు దగ్గర చేపల రవాణాలో పని చేస్తున్న ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ దయాకర్ అలియాస్ దయా(జె.డి.చక్రవర్తి)కి తన వ్యాన్‌లో లోడ్‌ని దించుతుండగా అనుకోకుండా ఒక మనిషి మృతదేహం కనిపిస్తుంది. అదే సమయంలో ఇంటి దగ్గర తన భార్య అలివేలు (ఈషా రెబ్బా) నిండు గర్భిణి.

దయాకి ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఇంటికి రమ్మంటే.. ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో ఆమె మాటను పట్టించుకోకుండా.. రెండు రోజులైనా కూడా తను ఇంటికి వెళ్ళకుండా ఓవర్ టైం చేస్తుంటాడు. ఇలాంటి సమయంలో తన వ్యాన్‌లో ఉన్న మనిషి మృతదేహం చుట్టూ ఉన్న పొలిటికల్ మాయలో నుండి దయా ఎలా తప్పించుకుంటాడనేదే ఈ వెబ్ సిరీస్ మూల కథ.

కథ వివరణ:

ఈ సిరీస్‌కి కథే మూలం, కథలో వచ్చే ట్విస్టులే బలం. జె.డి.చక్రవర్తి ‘దయా’ పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి. వినికిడి సమస్యతో, అమాయకంగా ఉన్న దయా తన స్నేహితుడి(జోష్ రవి) సహాయం తీసుకొని నాలుగు ఎపిసోడ్స్ వరకు ఒక విధంగా భయంతో, ఒద్దికతో, ఓపిక వహిస్తూ ఒక విధమైన పార్శ్వాన్ని చూపిస్తాడు. మొత్తం 8 ఎపిసోడ్స్‌గా రూపుదిద్దుకున్న ఈ కథలో మృతదేహాన్ని ఇంకో మృతదేహాం స్థానంలో మార్చే క్రమంలో దాదాపు నాలుగు ఎపిసోడ్స్ ఎన్నో మలుపులు తిరుగుతూ రన్ అవుతాయి.

తరువాత వచ్చే నాలుగు ఎపిసోడ్స్ ట్విస్టుల మీద ట్విస్టులతో, మిస్టరీ‌ని లోడ్ చేసుకుంటూ ఉత్కంఠ భరితంగా సాగుతుంటుంది. మధ్యలో కొన్ని సన్నివేశాలు షాకింగ్‌గా ఉంటాయి కానీ ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేవు. అది కాస్త నిరుత్సాహంగా అనిపించవచ్చు. టీవీ ఛానెల్ జర్నలిస్ట్ అయిన కవిత (రమ్య నంబీశన్) సీఎంతో మీటింగ్‌ని వద్దనుకుని మరీ కాకినాడ ఎందుకు వెళ్ళాలనుకుంటుంది.

కవిత భర్త కౌశిక్ (కమల్ కామరాజు) తనకి విడాకులు కావాలని ఎందుకు కోరతాడు? ఛానెల్‌లో పని చేసే రిపోర్టర్ షబానా(విష్ణు ప్రియ)-కవితల మధ్య సంబంధం ఏంటి? స్థానిక ఎమ్మెల్యే పరశురామ రాజు(పృథ్వీరాజ్) ని కవిత ఎందుకు కలవాలనుకుంటుంది? ఈ ప్రశ్నలన్నింటినీ ఒక మృతదేహంతో లింక్ చేసి.. దయా కోణంలో దర్శకుడు ఈ సిరీస్‌ను నడిపించాడు. అసలు దయా ఇందులో నుండి ఎలా తప్పించుకున్నాడో తెలియాలంటే ఇంట్రస్టింగ్‌గా రూపుదిద్దుకున్న ఈ సిరీస్ చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

జె.డి. చక్రవర్తి‌ని ఎందుకు టాలెంటెడ్ నటుడని అంటారో ఈ వెబ్ సిరీస్‌‌లో మరోసారి నిరూపించుకున్నా డు. అతని అనుభవం ఈ సిరీస్‌కు చాలా అంటే చాలా ఉపయోగ పడింది. నిజంగా అతని డిజిటల్ ఎంట్రీ అదరిపోయిందనే చెప్పాలి. రెండు విభిన్న కోణాలను ఆయన పాత్రలో దర్శకుడు మిక్స్ చేశాడు. రెండింటికి జె.డి. పరిపూర్ణతని ఇచ్చాడు. ఇషా రెబ్బా పాత్రకి అంతగా స్కోప్ లేనప్పటికీ.. ఉన్నంతలో తను చక్కగా చేసి అలరించింది.

స్నేహితుడి పాత్రలో జోష్ రవికి చాలా మంచి పాత్ర దక్కింది. ఎంటర్‌టైన్‌మెంట్ బాధ్యతని కాసేపు అతను తీసుకుంటాడు. జె.డి, రవి కలయికలో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా పండాయి. ముఖ్యంగా ఇలాంటి సన్నివేశాల్లో ఎడిటింగ్ తీరు బాగుంది. జర్నలిస్ట్ కవిత-కౌశిక్ సన్నివేశాలు చాలా పెద్ద మైనస్‌గా కనిపించాయి.

ఫెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం జర్నలిస్ట్ కవితగా చేసిన రమ్యా నంబీశన్ నటన బాగుంది. కౌశిక్ పాత్రలో కమల్ కామరాజు ఓకే. ఎమ్మెల్యే పాత్రలో పృథ్వీరాజ్ క్యారెక్టర్‌కి సరిపడే విధంగా నటించాడు. షబానా పాత్రలో విష్ణు ప్రియా కాసేపు మెరిపిస్తుంది. ఇంకా ఇతర పాత్రలలో నటించిన వారు వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

దయా చుట్టూ అల్లుకుపోయిన మిస్టరీని ఎక్కడా తగ్గకుండా కెమెరా వర్క్ మరియు ప్రొడక్షన్ డిజైన్ కథానుకూలంగా ఎంతో డిటైల్డ్‌గా చూపించారు. ఇలాంటి సిరీస్‌లు ప్రొడక్షన్ విలువల్లో ఏ మాత్రం తేడా రాకూడదు, ఆ లోటు ఇందులో పెద్దగా కనిపించదు.

నిర్మాణపు విలువలు బాగున్నాయి. సంగీతం ఈ సినిమాకి బ్యాక్ బోన్. కొన్ని సన్నివేశాల్లో బుల్లితెరపై చూస్తున్నా కూడా విజిల్ వేసే విధంగా ఉండే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని ఇచ్చారు శ్రవణ్ భరద్వాజ్. టెక్నికల్‌గా ఈ సిరీస్ చాలా రిచ్‌గా ఉందని చెప్పొచ్చు.

మొదటి నాలుగు ఎపిసోడ్స్ స్లో పాయిజన్‌లాగా ఎక్కించిన దర్శకుడు.. చివరి నాలుగు ఎపిసోడ్స్ అయితే ఏకంగా సీటెడ్ థ్రిల్లర్ లాగా నడిపించి తన దర్శకత్వం ప్రతిభను చాటుకున్నాడు. పవన్ సాధినేని ఈ సిరీస్‌ని దర్శకత్వం మలిచిన తీరు బాగుంది.

5వ ఎపిసోడ్ నుండి దయా మారిన తీరు, ఆ పాత్రలో జె.డి.చక్రవర్తి నటన కథని బాగా ఎలివేట్ చేస్తాయి. మిస్సింగ్ లింక్స్‌ని కలుపుతూ, దయా గతాన్ని సందర్భానుసారంగా స్క్రీన్‌ప్లే భాగంగా చూయిస్తూ, 5వ ఎపిసోడ్ నుండి 8వ ఎపిసోడ్ వరకూ దయాని కూడా అనుమానాస్పద మనిషిలానే చూపించిన తీరు కట్టిపడేస్తుంది. అదే ఈ వెబ్ సిరీస్‌లో ఉన్న హైలైట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

విశ్లేషణ:

‘ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి’ వంటి లవ్ స్టోరీస్‌తో సినిమాలు తీసిన పవన్ సాధినేని.. ఆ మధ్య ఎంతో విభిన్నంగా ‘సేనాపతి’ అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ని కూడా రూపొందించారు. రాజేంద్ర ప్రసాద్ అందులో కీలక పాత్ర పోషించారు. అదే తరహాలో, అలాంటి నేపథ్యంలోనే సాగే కథల్లో కథానాయకుడు ఎప్పుడైనా కీలక పాత్ర పోషిస్తాడు. ఎంతో సహజంగా, అవసరానికి కావాల్సిన విలక్షణమైన నటనా నైపుణ్యంతో కూడుకుని ఉంటాయి ఇలాంటి కథలు.

ఆ విషయానికొస్తే మొట్ట మొదటిసారిగా జె.డి.చక్రవర్తి ఓటీటీ‌లో వెబ్ సిరీస్ చేయడం, అది కూడా ఈ ‘దయా’ సిరీస్ అవడం చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఈ పాత్ర తన కెరీర్ లోనే పెద్ద హిట్ అయిన ‘సత్య’ సినిమాని తలపించేలా ఉంటుందని జె.డి. కూడా ఈ మధ్య ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు. ‘సత్య’లో ఉన్న తీక్షణత ఈ ‘దయా’లో కూడా కచ్చితంగా ఉంటుంది. చివరిలో ప్రేక్షకులకి అంతుపట్టని ప్రశ్నలతోనే ముగించే ఈ మొదటి సీజన్.. రెండవ సీజన్‌పై ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ముగించారు.

అందుకు ఉదాహరణ.. ‘సూర్యుడు అస్తమిస్తే యుద్ధం పూర్తయిందని కాదు’ అనే డైలాగే. దయా గతాన్ని, అసలు తను కాకినాడ ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలంటే రెండవ సీజన్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ మధ్య కాలంలో వచ్చిన వెబ్ సిరీస్‌లలో ‘ఏ’ సర్టిఫికెట్ డైలాగ్స్, సన్నివేశాల శాతం చాలా వరకు ఇందులో తగ్గించారనే చెప్పుకోవాలి.

అసలు లేవని చెప్పలేం కానీ.. అందరూ చూసే విధంగానే పవన్ సాధినేని ఈ సిరీస్‌ని మలిచాడని మాత్రం చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే పవన్ సాధినేని తీసిన ఈ ‘దయా’ ఇటీవల వచ్చిన చాలా వెబ్ సిరీస్‌ల కంటే బాగుందనే చెప్పుకోవాలి. వెబ్ సిరీస్‌లు ఇష్టపడే వారికి.. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి మాత్రం ఈ సిరీస్ యమా కిక్కిస్తుంది. ఇంట్రస్టింగ్ సిరీస్.. మిస్ కావద్దు.

ట్యాగ్‌లైన్: జె.డి. అలియాస్ దయా ఈజ్ బ్యాక్.. మిస్ కావద్దు

రేటింగ్: 3/5

Latest News