- దేశంలోనే లోపభూయిష్టమైన చట్టం
- 6౦ మంది అధికారులు చేసే పనిని ఒక్కరిరే అప్పగింత
- మంత్రివర్గ సిఫారసులను అమలు చేయని వైనం
ఉన్నమాట: ధరణి లోపాల పుట్ట. తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తక చట్టం 2020 ప్రజలకు నరకం చూపిస్తున్నది. భూయజమానులను ముప్పుతిప్పలు పెడుతున్నది. ఈ చట్టం రూపకల్పనే ఒక పెద్ద దగా, ఇది భూమిపై గుత్తాధిపత్యం కోసం, అధికారాల కేంద్రీకరణకోసం, భూమి హక్కులను కబ్జా చేయడం కోసం జరిగిన ఒక పెద్ద కుట్రగా ఒక రెవెన్యూ నిపుణుడు ఆరోపించారు.
దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇటువంటి లోపభూయిష్టమైన చట్టం లేదని ఆయన అన్నారు. ఈ చట్టం భూమి యజమానులకు జవాబుదారీగా ఉండదని, అధికారంలో ఉన్నవారికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని ఆయన అన్నారు. ఇది ఎంత వైరుధ్యభరితమైన చట్టమంటే “హక్కుల రికార్డు (ఆర్ఆర్)లో ప్రభుత్వం లేక ప్రభుత్వాధికారి భూమికి సంబంధించి చేసే చేర్పులు, సవరణలు లేక తీసివేతలకు సంబంధించి ఎటువంటి దావా వేయడానికి వీలు లేదు” అని చట్టంలో సెక్షన్ 9లో పొందుపరిచారు. ఇదే చట్టంలోని మరో సెక్షను ఏమి చెబుతుందో చూడండి.
‘ఈ చట్టం కింద పనిచేసే ఏ అధికారి అయినా భారతీయ శిక్షాస్మృతి సెక్షను 21 ప్రకారం పబ్లిక్ సర్వెంటుగా పరిగణింపబడతారు. పబ్లిక్ సర్వెంటుగా పరిగణింపబడేవారు ఎవరయినా హక్కుల రికార్డు(ఆర్ ఓఆర్)ను చెరిపినా లేక మోసపూరితంగా ఏదైనా ఆదేశాలు ఇచ్చినా సర్వీసు నుంచి తొలగింపు లేక బర్తరఫ్ శిక్షకు అర్హులు. దీంతోపాటు వర్తించే ఇతర చట్టాల ప్రకారం క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒకే చట్టంలో తప్పులు చేసేవారికి ఒక రక్షణ, తప్పులు చేస్తే శిక్షిస్తామని మరో బెదిరింపు. ఇది ఏ రకమైన తర్మానికి నిలబడుతుందో తెలియదు.
అధికార కేంద్రీకరణ
భూమి రికార్డుల మార్పు, నిర్వహణ అధికారం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు జిల్లా మొత్తానికి ఒకే ఒక వ్యక్తి చేతికి అప్పగించారు. ఆ వ్యక్తి జిల్లా కలెక్టరు. ఒకనాడు ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రజలకు సమీపంలో నిర్వహించబడిన రెవెన్యూ రికార్డుల వ్యవస్థను ఎన్టీరామారావు రద్దు చేసి మండలాలకు తీసుకొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మండలాల అధికారాలను కూడా కత్తిరించి జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.
అంటే ఒకనాడు తొమ్మిది వేల రెవెన్యూ గ్రామాలలో నిర్వహించబడిన రికార్డులను ఆ తర్వాత 400 మండలాలకు కుదించారు. కనీసం మండలం ప్రజలకు సమీపంలో ఉండేది. తమ సమస్యలను పరిష్కరించుకోవడం తేలికగా ఉండేది. కేసీఆర్ ఇప్పుడు ఆ వ్యస్థను కూడా రద్దు చేసి ఏకంగా జిల్లాకు ఒకరే రికార్డులను నిర్వహించే విధానం తీసుకువచ్చారు.
6౦ మంది అధికారులు చేసే పనిని ఒక్కరిరే అప్పగింత
ఒక జిల్లాలో అరవై మండలాల రెవెన్యూ అధికారులు చేసిన పనిని ఇప్పుడు కలెక్టరు ఒక్కడే చేయాలి. ఇది రెవెన్యూ నియంతృత్వానికి దారి తీసింది. కలెక్టరు ఎవరికీ దొరకడు. సామాన్యుల మొర ఆలకించేవారుండరు. ఈసేవా కేంద్రాల్లో వందలాది దరఖాస్తులు పెట్టుకోవడం, దరఖాస్తు పెట్టిన ప్రతిసారి వెయ్యి రూపాయలు చెల్లించుకోవడం, ఆ దరఖాస్తులకు నెలల తరబడి ఎటువంటి సమాధానం రాకపోవడం ఇప్పుడు నిత్యకృత్యం.
ఈ పరిస్థితిని అడ్డుపెట్టుకుని కలెక్టర్లు సెటిల్మెంటు కింగులుగా తయారయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. రికార్డుల సవరణకు ఎకరాకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు మాఫియా డాన్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఒక రియల్టరు ఆరోపించారు. ఇష్టారాజ్యంగా భూమి రికార్డులను మార్చివేస్తున్నారని, భూమి రికార్డులను మార్చేందుకు అనుసరించాల్సిన పద్ధతులేవీ పాటించడం లేదని ఆయన తెలిపారు.
మంత్రివర్గ సిఫారసులను అమలు చేయని వైనం
ధరణిలో లోపాలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ ఉపసంఘం సుమారు డజను సిఫారసులు చేసింది. ఆ సిఫారసుల ప్రాతిపదికగా ధరణిలో మార్పులు తీసుకురావాలని ఉపసంఘం సూచించింది. కానీ సీఎస్ గా ఉండి, ధరణి వ్యవహారాలన్నింటికీ బాధ్యత వహిస్తున్న సోమేశ్ కుమార్ ఒక్కటంటే ఒక్క సిఫారసును కూడా అమలులోకి తీసుకురాలేదని ఒక రెవెన్యూ అధికారి చెప్పారు.
దిద్దుబాటు వ్యవస్థ లేదు
ఒక రైతు భూమిని ధరణిలోకి వచ్చేసరికి మరో రైతు పేరుమీదకు మార్చారు. ఆ రైతు లబోదిబో మొత్తుకుని తనకు అంతకుముందున్న భూమి పత్రాలన్నింటినీ పట్టుకుని ఎంఆర్ ఓ ఆఫీసుకు వెళ్లారు. తామేమీ చేయలేమని, ఈ సేవలో దరఖాస్తు చేయాలని సూచించారు. ఈ సేవలో దరఖాస్తు చేశారు. మీ దరఖాస్తు అందిందని, మీ విన్నపం నంబరు ఫలానా అని ఒక మెసేజి వచ్చింది.
ఒక నెల రెండు నెలలు, మూడు నెలలు గడిచాయి. సమాధానం లేదు. మళ్లీ ఎంఆర్ఓ వద్దకు వెళ్లాడు. కలెక్టరే చేయాలి, తమ చేతుల్లో ఏమీ లేదు అని ఎంఆర్ ఓ చెప్పారు. కలెక్టరు వద్దకు వెళితే ఆయన ఆఫీసుకు రారు. ఎప్పుడొస్తారో తెలియదు. చివరికి ఒక కలెక్టరేటు అధికారిని సంప్రదిస్తే మరో రైతు ఆన్ లైన్‌లో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేశారని, ఆయన పేరున మీ భూమి బదిలీ అయిందని చల్లగా చావు కబురు చెప్పారు.
‘నేను అమ్మలేదు. ఒప్పందాలూ చేయలేదు. భూమి ఇప్పటికీ నేను సాగుచేసుకుంటున్నాను. అలా ఎలా చేస్తారని రైతు ప్రశ్నించారు. ‘మాకదంతా తెలియదు. ఆన్ లైన్‌లో జరిగిపోయింది’ అని ఆ అధికారి సమాధానం ఇచ్చారు. ‘ఏ పత్రాల ఆధారంగా నా భూమిని అవతలి వ్యక్తికి బదిలీ చేశారో ఆ పత్రాలు చూపించండి’ అని రైతు ఆ అధికారిని అడిగారు. మళ్లీ మీరు ఈసేవలో దరఖాస్తు చేసుకోండి అని సమాధానం. ఏ సేవలో దరఖాస్తు చేసుకున్నా ఆ పత్రాలు ఇవ్వలేదు.
జవాబు చెప్పేవాడు లేడు
భూమి రికార్డుల్లో తప్పులు దొర్లితే ఈ సేవలో దరఖాస్తు చేసుకొమ్మంటున్నారు. చేసుకున్నా పరిష్కారం లభించడం లేదు. అటువంటప్పుడు ఫిర్యాదు చేయడానికో, మొర పెట్టుకోవడానికో ఒక వ్యవస్థ అంటూ లేదు. మండల రెవెన్యూ ఆఫీసు నుంచి జిల్లా కలెక్టరేట్ దాకా అందరూ తప్పించుకోవడమే. మండల రెవెన్యూ అధికారులు తామేమీ చేయలేమని చెబుతున్నారు. జిల్లా కలెక్టరు ఆన్‌లైన్ దరఖాస్తులు పరిష్కరించరు.
ఒక వేళ దరఖాస్తు తిరస్కరిస్తే తిరిగి ఫిర్యాదు చేయడానికి కలెక్టరు దొరకరు. ఆయన సామాన్యులెవరినీ కలవరు. అసలు సామాన్యులు కలెక్టరు దాకా రావడం కూడా కష్టతరమైన పని. ఖరీదైన పని కూడా అయింది. మండల రెవెన్యూ ఆఫీసుల్లో వెయ్యి రెండు వేలు ఇచ్చి రికార్డులు దిద్దుబాటు చేయించుకున్న రైతులు ఇప్పడు వేలు లక్షలు చెల్లించుకోవలసిన దుస్థితి. బ్రోకర్ల వ్యవస్థ కూడా వచ్చేసింది. అంటే భూ రికార్డుల వ్యవస్థను ప్రజలకు ఎంతగా దూరం చేసిందో ఈ చట్టం అర్థం చేసుకోవచ్చు.
రికార్డుల నిర్వహణ లేదు.
ఒక రైతు భూమిని మరో రైతు పేరు మీదకు మార్చారు. భూమి కోల్పోయిన రైతు మండల రెవెన్యూ అధికారులను కలిసి ఏ పత్రాల ఆధారంగా భూబదలాయింపు జరిగిందో ఆ పత్రాలన్నీ ఇప్పించాలని కోరారు. ‘అదంతా ఆన్ లైన్‌లో జరుగుతుంది. కలెక్టరేట్ లోనే జరుగుతుంది. పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదు’ అని మండల రెవెన్యూ అధికారి సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత కలెక్టరేట్‌లో కూడా ఆ రైతు మొరపెట్టుకున్నాడు.
‘అయ్యా నా భూమిని నేను అమ్మకుండానే వేరే వారి పేరుమీదకు మార్చారు. ఎలా మార్చారు? ఆయన ఏమి పత్రాలు పెట్టారు? ఆ కాగితాలు నాకు ఇప్పించండి. నాకు న్యాయం కావాలి’ అని ఆ రైతు కలెక్టరేట్ అధికారులనూ అడిగారు. వారి నుంచి పాత సమాధానమే. ‘ఆన్ లైన్‌లో జరుగుతుందని, ఏమీ చేయలేమని’ వారు సమాధానం ఇచ్చారు. ఆ రైతు ఈసారి సమాచార హక్కు చట్టం కింద అటు మండల రెవెన్యూ ఆఫీసులో, ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్ లో దరఖాస్తు చేశారు.
ఆ దరఖాస్తులకు కూడా… పాత సమాధానమే చెప్పారు. ఆ రైతు రాష్ట్ర సమాచార కమిషన్ కు దరఖాస్తు చేశారు. అక్కడ కూడా ఆ అధికారులు ఆన్ లైన్ పాటే వినిపించారు. సమాచార కమిషన్ భూబదలాయింపు కు ప్రాతిపదిక అయిన పత్రాలు ఇచ్చి తీరవలసిందే అని ఆదేశాలు ఇచ్చిందని, ఆ తర్వాతనే తనకు కొన్ని పత్రాలు ఇచ్చారని ఆ రైతు వాపోయారు. ఈ పత్రాలతో తాను ఇప్పుడు సివిల్ కోర్టు మెట్లు ఎక్కాలని చెబుతున్నారని, ఇది అన్యాయమని తనకు సంబంధం లేకుండా తన భూమిని కాజేసి ఇన్ని చోట్లకు తిప్పడం. ఏమి న్యాయమని ఆ రైతు ప్రశ్నించారు.
అవినీతి అనేక రెట్లు
గ్రామ రెవెన్యూ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి రికార్డులను తారుమారు చేస్తున్నారని, ఇది నిర్మూలించడానికే కొత్త చట్టం తెచ్చామని ప్రభుత్వం చెప్పింది. గ్రామ రెవెన్యూ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు ప్రజలకు దగ్గరగా ఉండేవారు. తప్పులు చేయడానికి భయపడేవారు.
నేరుగా ప్రజల మధ్య ఉండడం వల్ల వారు అరుదుగా మాత్రమే అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండేది. ఒక వేళ తప్పులు చేసినా దిద్దుబాటు చేయించుకోవడం ప్రజలకు సులువుగా ఉండేది. వెయ్యి. రెండు వేల రూపాయలు లంచంగా ఇచ్చి రికార్డుల లోపాలను సరిచేయించుకోవడం సాధ్యమయ్యేది. ఇప్పుడు అది కలెక్టర్ల చేతికి మారిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో ఒక సర్వే చేస్తే తెలిసి పోతుంది.
భూరికార్డుల లోపాలను సరిచేయడానికి ఇప్పుడు కొన్ని వందల రెట్ల ముడుపులు చెల్లించుకోవలసి వస్తున్నదని రైతులు, రియల్టర్లు ఆరోపిస్తున్నారు. ‘ఎప్పుడో అనేక సంవత్సరాల క్రితం లక్ష రూపాయలకు ఎకరం చొప్పున భూమిని కొనుక్కున్న. వెంటనే పట్టా పాసుపుస్తకాలు వచ్చాయి. పహానీలలో నమోదయింది. ధరణి రాకముందు వరకు భూమి నా పేరు మీదే ఉంది. అకస్మాత్తుగా పాత యజమానుల పేరిట ధరణిలో నమోదయింది. అది మార్చాలని అడిగితే కలెక్టర్ ఆఫీసు నుంచి స్పందన లేదు.
పాత యజమాని తాను భూమిని అమ్మినట్టు లేఖ కూడా ఇచ్చారు. అయినా కోర్టు నుంచి ఆర్డరు తెచ్చుకోవలసిందేనని ముందుగా చెప్పారు. తాజాగా ఎకరానికి ఐదు లక్షలు ఇస్తే మొత్తం సమస్యను పరిష్కరిస్తామని ఒక బ్రోకరు ప్రతిపాదనతో వచ్చారు. నేను కొన్నది లక్ష రూపాయలకు ఎకరం. ఇప్పుడు అడుగుతున్నది ఎకరానికి ఐదు లక్షల రూపాయలు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా’ అని ఒక రైతు వాపోయాడు. పట్టణ ప్రాంత జిల్లాల్లో ఈ దందా చాలా ఎక్కువగా నడుస్తున్నదని విశ్వసనీయ సమాచారం.
దున్నపోతు మీద వర్షం.
పట్టాదారు పాసుపుస్తకాల చట్టంలోని లోపాలను గురించి పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. బాధితుల కథనాలు అనేకం బయటికి వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా తాము అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని ప్రకటిస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని సరళతరం చేయడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయడం లేదు. రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ఏడాది కాలంగా ఊరిస్తున్నది కానీ ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు.
సమగ్ర భూ సర్వే నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వం కిమ్మనకుండా వ్యవహరిస్తున్నది. భూరికార్డులలో తప్పులను సరిదిద్దే వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోతే ముందు ముందు అనేక దారుణాలు జరిగే అవకాశం ఉంది. కలెక్టర్లు ఏయే పిటిషన్ ను ఎన్నిరోజుల్లోగా పరిష్కరించాలో పేర్కొంటూ సోమేశ్ కుమార్ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఒక్క కలెక్టరు కూడా ఆ మార్గదర్శకాలను పాటించిన పాపాన పోవడం లేదు. అసలు ధరణి కార్యకలాపాలను పర్యవేక్షించే యంత్రాంగమే లేదు. దీంతో కలెక్టర్ల ఇష్టారాజ్యం నడుస్తున్నది.
– విఎం కృష్ణారెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాది