Site icon vidhaatha

మా వడ్డీ సొమ్ములు చెల్లించండి.. కదం తొక్కిన మహిళలు

విధాత, నిజామాబాద్: దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం మహిళలు కదం తొక్కారు. తమకు రావాల్సిన వడ్డీ సొమ్ము, రుణాలకు సంబంధించిన డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మహిళలు మండలంలోని అన్ని గ్రామాల నుంచి తరలివచ్చారు.

ఈ సందర్బంగా ప్రభుత్వం బకాయి పడిన వడ్డీ లేని రుణ బకాయిలు, స్త్రీనిధి వడ్డీ, అభయ హస్తం డబ్బులు వెంటనే చెల్లించాలని కాటిపల్లి వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీ మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎండివోకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థని ఎత్తి వేసినట్లుగా మహిళా సంఘాలను కూడా ఎత్తి వేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. వారికి న్యాయంగా అందాల్సిన అనేక రాయితీలను ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు.

గత ఐదు ఏళ్లుగా మహిళలకు అందాల్సిన వడ్డీ లేని రుణాల విడుదల కోసం మహిళలు ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం బకాయిలు జమ చేయటం లేదన్నారు. ఇకనైనా జాప్యం చేయకుండా మహిళలకు రావలసిన వడ్డీ సొమ్ము మహిళల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళల ఖాతాల్లో డబ్బులు వచ్చే వరకు బీజేపీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Exit mobile version