ఆడబిడ్డకు జన్మనిచ్చిన జూనియర్ జడ్జి
విధాత, వరంగల్: హన్మకొండ జిల్లా జూనియర్ సివిల్ జడ్జ్ శాలిని స్థానిక ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్‌లో ప్రసవించారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలపై నమ్మకంతో హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన నందు ఆమె ఆడ బిడ్డకు సోమవారం జన్మనిచ్చారు. ఈ సందర్భంగా శాలినికి ప్రభుత్వం అందించే కేసీఆర్ కిట్టును ఆందచేశారు. దవాఖానలో అందించిన సేవలపట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
హన్మకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు హాస్పిటల్ వర్గాలతో పాటు జడ్జిని ఈ సందర్భంగా అభినందించారు. తెలంగాణలో ప్రభుత్వం గర్భిణుల ఆరోగ్యంపై తీసుకుంటున్న చర్యలకు ఆకర్షితులై జిల్లా జూనియర్ సివిల్ జడ్జ్ శాలిని ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో పురుడు పోసు కోవడం అభినందనీయమన్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ దవాఖానల్లో వసతి సౌకర్యాలు, డాక్టర్ల సేవలు ఎంతో మెరుగయ్యాయని అన్నారు. అన్ని వర్గాలు ప్రభుత్వ వైద్యసేవలను వినియోగించు కోవాలని కోరారు.