హైదరాబాద్:
ACT Fibernet | నగరంలో ఇంటర్నెట్ సేవలు నెలరోజులుగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. TGSPDCL నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల ACT ఫైబర్‌నెట్ వినియోగదారులు సతమతమవుతున్నారు. అధికారులు అనాలోచితంగా ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ కట్ చేయడం వల్ల వ్యాపారాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ అధికారులకు పలు సార్లు విజ్ఞప్తులు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పైగా కొత్తగా వేసిన కేబుల్స్‌ను కూడా మళ్లీ కట్ చేశారు. Airtel ఫైబర్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుండటం, వారి కేబుళ్లు కట్ చేయకపోవడం, ACT వినియోగదారులు మాత్రమే సమస్యలు ఎదుర్కొంటుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు Reliance Jio తన స్వంత పోల్స్, కేబుల్స్ ద్వారా సేవలు అందిస్తున్నందువల్ల ఎటువంటి అంతరాయం లేకుండా వినియోగదారులకు నిరంతర సదుపాయం కొనసాగుతోంది. ACT కస్టమర్లు నెలరోజులుగా ఇబ్బందులు పడుతుండగా, Airtel, Jio కస్టమర్లు సజావుగా నెట్ వాడుతున్నారు. ఈ పరిస్థితి వల్ల ACT సేవలు పొందుతున్న ఐటీ కంపెనీలు, మీడియా హౌస్‌లు, స్టార్టప్‌లు, ఈ-కామర్స్ వ్యాపారాలు పెద్ద ఎత్తున నష్టాలు ఎదుర్కొంటున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు పనులు పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు, పరీక్షలు రాయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ ప్రజలు ఆన్‌లైన్ బ్యాంకింగ్, బిల్లులు చెల్లించడం, టెలీమెడిసిన్ సేవలు వాడుకోవడం కష్టమైంది. దీంతో మరో మార్గం లేని ACT వినియోగదారులు జియో, ఎయిర్టెల్ వైపు మళ్లుతున్నారు. ఫలితంగా ACT కంపెనీకి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని యాజమాన్యం వాపోతోంది. వినియోగదారులకు త్వరలో కనెక్షన్‌ను పునరుద్ధరిస్తామని మెయిళ్లు పంపుతూ వేడుకుంటోంది.
ఒకవైపు ప్రజలు, ACT కంపెనీ విజ్ఞప్తులు చేస్తుంటే, మరోవైపు అధికారులు పట్టించుకోకపోవడం TGSPDL నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ACT కేబుల్స్‌ను మాత్రమే కట్ చేస్తూ Airtel, Jio సేవలకు ఎటువంటి ఆటంకం కలగకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. దీని వెనుక మరేదో మతలబుందని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
నగర జీవనానికి ప్రాణాధారం అయిన ఇంటర్నెట్ నెలరోజులుగా అధికశాతం(ACT కు హైదరాబాద్‌లో రెండో అత్యధిక కనెక్షన్లు) ప్రజలకు అందకపోవడం వల్ల ప్రజా జీవనాన్ని గజిబిజిగా మారింది. TGSPDCL స్పష్టతనిస్తూ తక్షణ పరిష్కారం చూపాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.