Cloudflare Down | కుప్పకూలిన క్లౌడ్‌ఫ్లేర్: వేలాది వెబ్​సైట్లు డౌన్​

క్లౌడ్‌ఫ్లేర్‌లో చోటు చేసుకున్న భారీ సాంకేతిక లోపం కారణంగా చాట్‌జీపీటీ, ఎక్స్, పెర్‌ప్లెక్సిటీ, స్పాటిఫై, డిస్కార్డ్ వంటి ప్రముఖ వెబ్​సైట్లు గంటల పాటు డౌన్‌. అసాధారణ ట్రాఫిక్ పెరుగుదల కారణమని కంపెనీ తెలిపింది. సేవలు ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాయి.

Cloudflare global outage impact

Global Internet Disruption: Cloudflare Outage Cripples ChatGPT, X, Perplexity and Major Platforms Worldwide

(విధాత టెక్ డెస్క్)

హైదరాబాద్, నవంబర్ 18, 2025

Cloudflare Down | ఇంటర్నెట్‌కు వెన్నెముకగా నిలిచే క్లౌడ్‌ఫ్లేర్ సేవల్లో ఈరోజు ఉదయం చోటుచేసుకున్న అనూహ్యమైన సాంకేతిక లోపం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్​నెట్​ సేవలను తీవ్రంగా దెబ్బతీసింది. చాట్‌జీపీటీ, ఎక్స్ (గతంలో ట్విట్టర్), పెర్‌ప్లెక్సిటీ, గ్రాక్, డిస్కార్డ్, స్పాటిఫై, కాన్వా, జెమిని వంటి ప్రముఖ పోర్టళ్లతో పాటు వినియోగదారులకు చెందిన వెబ్​సైట్లు, యాప్​లు లక్షల్లో ఆగిపోయాయి. గంటల తరబడి నెమ్మదిగా పనిచేయడం లేదా పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, క్రిప్టో సేవలు, క్లౌడ్ అప్లికేషన్‌లు వరుసగా “500 Internal Server Error”లను చూపించాయి.

క్లౌడ్ఫ్లేర్( Cloudflare) సేవలన్నీ ఒక్కసారిగా బంద్

ఈ అంతరాయం ఇంత ప్రభావం చూపడానికి ప్రధాన కారణం వెబ్​సైట్లలో క్లౌడ్‌ఫ్లేర్(Cloudflare) పాత్ర. క్లౌడ్‌ఫ్లేర్ అనేది ఇంటర్నెట్‌కు సంబంధించి కాపలాదారు, బాడీగార్డ్​, వేగవంతమైన బ్రౌజింగ్​ అనుభవం ఇచ్చే వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల వెబ్‌సైట్లు వేగంగా లోడ్ కావడం, సైబర్​ దాడులనుండి రక్షించబడటం, ట్రాఫిక్ ఎక్కువైనా సర్వర్లు క్రాష్ కాకుండా ఉండడం వంటి క్లౌడ్‌ఫ్లేర్ ఆధారిత మౌలిక సదుపాయాల వల్లే సాధ్యమవుతుంది. వెబ్‌సైట్లకు CDN, DNS, DDoS రక్షణ, Zero Trust భద్రత వంటి కీలక మౌలిక సేవలను అందించే ఈ సంస్థలో చిన్న లోపం కూడా ప్రపంచ ఇంటర్నెట్‌ను స్థంబింపజేయగలదు.

క్లౌడ్‌ఫ్లేర్ The Guardian పత్రికకు అందించిన ప్రకటన ప్రకారం, 11:20 UTC సమయంలో ఒక్కసారిగా ఇంటర్​నెట్​లోకి  భారీ ట్రాఫిక్ వచ్చింది. ఈ ఒక్క స్పైక్ కారణంగా CDN నెట్‌వర్క్‌లోని అనేక మార్గాలు ఓవర్‌లోడ్ అవడంతో కీలక సేవలు అడపాదడపా పనిచేయకపోవడం ప్రారంభమైందని కంపెనీ తెలిపింది. “అసాధారణంగా పెరిగిన ట్రాఫిక్​కు కారణాన్ని ఇంకా గుర్తించలేదు. సేవలను సాధారణ స్థితికి తీసుకురావడం అత్యవసరంగా కొనసాగుతోంది” అని వివరించింది.

వేలాది ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు డౌన్ — ప్రపంచ డిజిటల్ వ్యవస్థకు క్లౌడ్‌ఫ్లేర్ షాక్

ప్రభావితమైన సేవల జాబితా విస్తారంగా ఉంది:
• OpenAI యొక్క చాట్‌జీపీటీ
• ఎక్స్ (X.com)
• పెర్‌ప్లెక్సిటీ
• గ్రాక్ (xAI)
• డిస్కార్డ్
• స్పాటిఫై
• కాన్వా
• గూగుల్ జెమిని (కొంత మేరకు)
• గేమింగ్: లీగ్ ఆఫ్ లెజెండ్స్, జెన్‌షిన్ ఇంపాక్ట్, హోంకై స్టార్ రైల్ మొదలైనవి

అంతరాయం సమయంలో వినియోగదారులు ప్రత్యామ్నాయంగా బ్లూస్కై, థ్రెడ్స్ ఉపయోగించినట్లు గూగుల్ ట్రెండ్స్ డేటా సూచిస్తోంది. అదే సమయంలో క్లౌడ్​ఫ్లేర్​ వాడుతున్న వినియోగదారుల వెబ్​సైట్లు కూడా మొరాయించాయి.

ఈ ప్రభావం అంత విస్తృతంగా రావడానికి రెండో ముఖ్యమైన కారణం క్లౌడ్​ఫ్లేర్​ అందించే CDN అనే వ్యవస్థ. CDN (Content Delivery Network) అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద సర్వర్ల నెట్​వర్క్​ — ఇది వినియోగదారుడికి దగ్గరలో ఉన్న సర్వర్‌ నుండి వెబ్‌సైట్ కంటెంట్‌ను అందిస్తుంది. దీనివల్ల:

కారణం, మన వెబ్​సైట్​ను నిక్షిప్తం చేసిన సర్వర్​ ఎక్కడో అమెరికాలో ఉండొచ్చు. కానీ, తరచుగా ఉపయోగించే ఫోటోలు, వీడియోలు, ఫైళ్లు తదితర విషయమంతా సిడిఎన్​ సర్వర్​లోనే ఉంటుంది. దాంతో మొత్తం డాటా అంతా మెయిన్​ సర్వర్​ నుండి కాకుండా ఈ సీడీఎన్​ నుండే వస్తుంది. దాంతో పేజీలు వేగంగా లోడ్​ అవుతాయి. అంటే ప్రతీ వెబ్​సైట్​కు రెండు సర్వర్లు ఉంటాయన్నమాట( అందరూ సిడిఎన్​ వాడాలనేం లేదు. అవసరాన్ని బట్టి).

ఈ CDN సేవలు అందించడంలో క్లౌడ్‌ఫ్లేర్  ప్రపంచవ్యాప్తంగా ప్రధాన పాత్ర పోషిస్తుండడంతో, నెట్‌వర్క్‌లో వచ్చిన లోపం ప్రపంచవ్యాప్తంగా అనేక సేవలను ఒక్కసారిగా ప్రభావితం చేసింది. Cloudflare  కాకుండా, Akamai, Fastly వంటి కంపెనీలు ప్రపంచంలో పెద్ద CDN ప్రొవైడర్లు.

ఓ పక్క స్థంభించిన సేవలు – మరోపక్క భారీ కొనుగోలు : క్లౌడ్ఫ్లేర్ విచిత్ర అనుభవం

ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్​ఫ్లేర్​ సేవలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న అదే సమయంలో క్లౌడ్‌ఫ్లేర్ మరో ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రముఖ AI ప్లాట్‌ఫారమ్ “Replicate” ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ వద్ద ఉన్న 50,000 పైగా ప్రొడక్షన్-రెడీ AI మోడల్స్ త్వరలోనే క్లౌడ్‌ఫ్లేర్ Workers AI వేదిక ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఇది AI మౌలిక సదుపాయాల రంగంలో క్లౌడ్‌ఫ్లేర్ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఈ రోజు జరిగిన అవుటేజ్ లాంటి అడ్డంకులు ఉన్నప్పటికీ, సంస్థ భవిష్యత్ AI దిశలో ఎంత పెద్దగా ఆలోచిస్తోందో స్పష్టం చేస్తోంది.

సాయంత్రం 6 గంటలకు విడుదలైన తాజా అప్‌డేట్ ప్రకారం Access, WARP, DNS, CDN వంటి కీలక సేవలు పూర్వపు స్థితికి చేరుకున్నట్లు క్లౌడ్​ఫ్లేర్​ ప్రకటించింది. లండన్‌తో పాటు అనేక డేటా సెంటర్‌లలో ఎర్రర్ రేట్లు మునుపటి స్థాయికి తగ్గాయి. కొంతమంది వినియోగదారులు ఇంకా చిన్నపాటి సమస్యలను ఎదుర్కొనే అవకాశమున్నప్పటికీ, వ్యవస్థ మొత్తం పునరుద్ధరణ దిశగా సాగుతోంది.

మొత్తం మీద, ఈ రోజు క్లౌడ్‌ఫ్లేర్‌కి రెండు విచిత్రమైన అనుభవాలు  కలిగాయి.  — ఒకవైపు ప్రపంచ ఇంటర్నెట్‌ను కుదిపేసిన భారీ సేవల అంతరాయం, మరోవైపు భవిష్యత్తులో AI రంగాన్ని ప్రభావితం చేసే భారీ కొనుగోలు. ఏదేమైనా ఈనాటి ఈ అంతరాయం క్లౌడ్​ఫ్లేర్​ను మరింత రాటుదేలుస్తుందన్న విషయంలో సందేహం లేదు.

Latest News