విధాత: రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా బీజేపీ సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఆయా రాష్ట్రాలకు పార్టీ ఇన్‌ఛార్జులు, సహ ఇన్‌ఛార్జులను నియమించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ జాబితాలో మాజీ సీఎంలు, మాజీ కేంద్ర మంత్రులు, సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తున్నది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రుపాణీకి పంజాబ్, చండీగఢ్, త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేబ్‌కు హరియాణా, మాజీ కేంద్ర మంత్రులు ప్రకాశ్ జావడేకర్‌కు కేరళ, మహేశ్ శర్మకు త్రిపుర బాధ్యతలు అప్పగించారు.
గతంలో హరియాణాకు ఇన్‌ఛార్జిగా ఉన్న పార్టీ జనరల్ సెక్రెటరీ వినోద్ తావ్‌డేను బిహార్‌కు ఇన్‌ఛార్జిగా నియమించారు. తెలంగాణలో తరుణ్ ఛుగ్, రాజస్థాన్‌లో అరుణ్‌సింగ్, మధ్యప్రదేశ్‌లో మురళీధర్‌రావు వంటి కొంతమందిని కొనసాగించారు. సీనియర్ నేత ఓం మాథుర్.. ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ను గద్దెదించాలని బీజేపీ భావిస్తున్నది. ఇదిలా ఉండగా.. మాథుర్ ఇటీవల సెంట్రల్ ఎలక్షన్ కమిటీకీ ఎంపికయ్యారు. బీహార్ మాజీ మంత్రి మంగళ్ పాండేకు.. పార్టీ కీలకంగా భావించే పశ్చిమ బెంగాల్ బాధ్యతలు అప్పగించారు.