విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పోలీస్ స్టేషన్లో చేసే న్యాయపరమైన ఫిర్యాదులపై తక్షణమే కేసు నమోదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ అధికారులకు స్పష్టం చేశారు. మహిళలపై జరిగే నేరాలతోపాటు, భూ కబ్జాలు, తీవ్రంగా కొట్టిన కేసులు, రౌడీయిజం పైన స్టేషన్ అధికారులు తక్షణం కేసులను నమోదు చేయాలని ఆదేశించారు.
కొన్ని సందర్భాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించకుంటే న్యాయం చేయలేమని స్పష్టం చేశారు. చట్టపరంగా విధులను నిర్వహిస్తూ నిర్ణయాలను తీసుకోవాలని సూచించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులతో సీపీ తొలిసారి నేర సమీక్షా సమావేశాన్ని హనుమకొండలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణం కేసులు నమోదు చేస్తే పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు.
రానున్న రోజుల్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ బాగా జరగాలన్నారు. దొంగతనాలకు పాల్పడిన నేరస్థులను గుర్తించడంపాటు, నాన్-బెయిల్ వారెంట్లు, సైబర్ క్రైం నిందితులను పట్టుకోవడం కోసం డివిజన్ల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ బృందాలు లా అండ్ ఆర్డర్, సిసిఎస్ పోలీసులతో సమన్వయ పర్చుకుంటూ నిందితులను పట్టుకోవాలన్నారు.
మిస్సింగ్ కేసుల్లోని వ్యక్తులను గుర్తించేందుకుగాను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. భూ కబ్జా కేసుల్లో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే వాహన రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా, మార్ఫింగ్ చేసిన వాహనదారులపై చీటింగ్ కేసులను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిసిపిలు వెంకటలక్ష్మి, సీతారాం, అదనపు డిసిపిలు వైభవ్ గైక్వాడ్, సంజీవ్, సురేష్‌కుమార్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.