విధాత: భూమి మీద నూకలుంటే ఎన్ని గండాలు ఎదురైన మృత్యుంజయులుగానే ఉంటారన్న సామేతను నిజం చేస్తూ ఓ డ్యామ్ దిగువన నది పరివాహకంలో ఉన్న ముగ్గురు బాలురకు ఎదురైన ఘటన నిదర్శనంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా అవుతుంది. ముగ్గురు బాలురు నదిలో ఉండగా డ్యామ్ గేట్లు తెరవడంతో ఒక్కసారిగా వరద నీరు దిగువకు దూసుకువచ్చింది. తమపైకి వేగంగా దూసుకొస్తున్న మృత్యు ప్రవాహాన్ని గమనించి అప్రమత్తమైన ఆ ముగ్గురు బాలురు వేగంగా ఒడ్డుకు పరుగెత్తారు. వరద ఉదృతి వారిని తాకే లోపు ఒడ్డుపైకి చేరుకుని ప్రాణాలతో బయటపడ్డారు. వారు ఒడ్డుకు చేరుకున్న సెకను వ్యధిలోనే నీరు కూడా భారీగా సముద్రపు కెరటాలను తలపించేలా ఒడ్డుపైకి దూసుకొచ్చింది.
అయితే అప్పటికే ఒడ్డున చేరుకున్న ఆ ముగ్గురు క్షేమంగా ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు. లేదంటే ఆ వరద ఉదృతిలో గల్లంతయ్యేవారే. క్షణకాలంలో మృత్యువును తప్పించుకున్న వారికి భూమిమీద నిజంగా నూకలున్నాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ పిల్లలు కావాలనే రీల్స్ కోసం ఈ దుస్సాహసం చేశారని వీడియో చూసిన వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు రీల్స్ కోసం చేసినా క్షణాలు ఆలస్యమైనా వారు వరదలో కొట్టుకపోయేవారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.