ఆనందయ్యలను ఆగం చెయ్యకండి

విధాత:ఆనందయ్య వైద్యంపై కొందరు తిట్టుకోవడం చూస్తుంటే జుగుప్స కలుగుతున్నది. వీళ్ళు చదువుకున్నవాళ్లేనా, శాస్త్రాలపై నమ్మకం ఉన్నవాళ్లేనా అన్న అనుమానం కలుగుతున్నది. ఆనందయ్య తన వైద్య విధానం గురించి తానుగా ఎటువంటి ప్రచారం చేసుకోలేదు. వైద్యంతో వ్యాపారం చేయలేదు. వందలు, వేల మందిని రప్పించుకుని వైద్యం చేసే ఉద్దేశం ఉన్నట్టు ప్రకటించుకోలేదు. తరతరాలుగా వారసత్వంగా నేర్చుకున్న చికిత్స విధానంతో తన వద్దకు వచ్చిన వారికి ఉపశమనమో, ఊరటో కలిగిస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల అత్యుత్సాహమో, నిజంగానే జనానికి మేలు […]

  • Publish Date - May 27, 2021 / 06:54 AM IST

విధాత:ఆనందయ్య వైద్యంపై కొందరు తిట్టుకోవడం చూస్తుంటే జుగుప్స కలుగుతున్నది. వీళ్ళు చదువుకున్నవాళ్లేనా, శాస్త్రాలపై నమ్మకం ఉన్నవాళ్లేనా అన్న అనుమానం కలుగుతున్నది. ఆనందయ్య తన వైద్య విధానం గురించి తానుగా ఎటువంటి ప్రచారం చేసుకోలేదు. వైద్యంతో వ్యాపారం చేయలేదు. వందలు, వేల మందిని రప్పించుకుని వైద్యం చేసే ఉద్దేశం ఉన్నట్టు ప్రకటించుకోలేదు. తరతరాలుగా వారసత్వంగా నేర్చుకున్న చికిత్స విధానంతో తన వద్దకు వచ్చిన వారికి ఉపశమనమో, ఊరటో కలిగిస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల అత్యుత్సాహమో, నిజంగానే జనానికి మేలు జరుగుతుందని నమ్మి చేసిన ప్రచారమో ఈ సమస్యను తెరపైకి తెచ్చింది. అంతలోనే ఇంత రచ్చ చేయవలసినది ఏముందో అర్థం కాదు.

ఆనందయ్య వైద్యం వల్ల ఏమన్నా జరిగితే ఎవరిది బాధ్యత? అని కొందరు మేధావులు ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైనా హాస్పిటల్లో చేరారా? లేక ఎవరినయినా చేర్పించారా అన్న అనుమానం కలుగుతున్నది. ‘మీకు ఏమి జరిగినా మా బాధ్యతలేదు’ అని ప్రతి పెషేంట్ బంధువులు ముందుగానే ప్రమాణ పత్రాలు రాసివ్వడం వీళ్లకు తెలుసా? అంత శాస్త్రబద్ధమైన చికిత్స అయినప్పుడు ముందే ప్రమాణ పత్రాలు ఎందుకు తీసుకుంటున్నట్టు? ఆ చికిత్సకు కూడా హామీ లేదని అర్థం.

అంతెందుకు? కోవిడ్ చికిత్సకు సంబంధించిన ప్రొటొకాల్స్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ వైద్య పరిశోధనా మండలి ఇప్పటికి ఎన్నిసార్లు మార్చిందో ఎవరైనా లెక్క చెప్పగలరా? రెమిడీసీవర్ ముందు వాడమని చెప్పిందెవరు? ఇప్పుడు తగ్గించమని చెప్పిందెవరు? స్టెరాయిడ్స్ ఎక్కువ వాడితే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వస్తాయని ముందుగా ఎందుకు తెలియరాలేదు? ఎందుకు తెలియలేదు అంటే కోవిడ్ చికిత్సకు సంబంధించి ఏది ఎంతవరకు వాడాలో ముందుగా ప్రయోగాలేమీ జరగలేదు. అంత సమయం కోవిడ్ ప్రపంచానికి ఇవ్వలేదు. ఉప్పెనలో కొట్టుకుపోతున్నవాడు గట్టి ఆధారమే కావాలని ఎదురు చూడడు. గడ్డిపోచ దొరికినా, చెట్టుకొమ్మ దొరికినా అలుముకుంటాడు. ఇప్పుడు పేషేంట్లు, డాక్టర్లు అందరి పరిస్థితీ అదే.

శాస్త్రబద్ధమైన కోవిడ్ చికిత్స పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకున్న వాళ్ళు గుండె పోట్లతో, మెదడు చిట్లి పోవడాలతో ఎందుకు కుప్పకూలిపోతున్నారు? ఎంతమంది చనిపోతున్నారు? ఒక చికిత్సా విధానాన్ని మరో చికిత్స విధానంతో పోటీ పెట్టి ఖండించడం సమంజసం కాదు. నాకు బాగా గుర్తు. నేను ఇంటర్ విద్యకు వచ్చేదాకా మా ఊరి వైద్యుడు కొండయ్య తాతే. పాము కరిసినా, తేలుకుట్టినా, జ్వరం వచ్చినా, కాలు చెయ్యి విరిగినా ఆయనే డాక్టర్. ఆ తర్వాత ఆర్ఎంపీలు వచ్చారు. పట్నాలకు వచ్చాకే పట్టాలు పుచ్చుకున్న డాక్టర్లు దొరికింది.

ఆనందయ్యలు ఊరికొకరు ఉండేవారు. వాళ్ళేమీ జనాన్ని పీడించుకు తిన్న అనుభవమైతే లేదు. వాళ్ళు మన వైద్య చికిత్స మూలాలు. ఆపదలో ఏ చికిత్స అందుబాటులో ఉంటె అది తీసుకుంటారు. అన్నీ అందుబాటులో ఉండనివ్వండి. శాస్త్ర వైద్యులు ప్రమాణ పత్రాలు తీసుకుంటున్నారు. ఆనందయ్య అంత తెలివి ప్రదర్శించడం లేదు. తనకు తెలిసింది చేసుకుపోతున్నారు. అనుమానం ఉంటె పరీక్షించాల్సింది ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు.
*కట్టా శేఖర్ రెడ్డి,RTI కమిషనర్, తెలంగాణ.