విధాత: ఉత్తరప్రదేశ్‌లో పెంపుడు కుక్కల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మొన్న ఘజియాబాద్‌లో, నిన్న నోయిడాలో.. నేడు మళ్లీ ఘజియాబాద్‌లో.. ఇలా వరుసగా పెంపుడు కుక్కలు పిల్లలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. మొన్న, నిన్న లిఫ్ట్‌ల్లో పిల్లలపై కుక్కలు దాడులు చేయగా, నేడు పార్కులో ఓ బాలుడిపై పిట్‌బుల్ డాగ్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
ఈ ఘటన సెప్టెంబర్ 3న చోటు చేసుకోగా.. 8వ తేదీన వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ సంజయ్ నగర్‌లోని ఓ పార్కులో పదేండ్ల బాలుడు ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడికి లలిత్ త్యాగి అనే వ్యక్తి పిట్ బుల్ డాగ్‌తో వచ్చాడు. ఆ పెంపుడు కుక్క పదేండ్ల బాలుడిపై దూకి, దాడి చేసింది.
ముఖంపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది బాలుడికి. నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. బాధితుడి ముఖంపై 150 కుట్లు పడ్డాయి. అయితే పిట్ బుల్ డాగ్ యజమానికి రూ. 5 వేలు జరిమానా విధించారు అధికారులు.
ఎందుకంటే ఆ కుక్క ఎలాంటి లైసెన్స్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ లేదు. బహిరంగ ప్రదేశాల్లోకి తమ పెంపుడు కుక్కలను తీసుకొచ్చే సమయంలో, వాటి నోర్లకు ఏదైనా అడ్డుగా పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.