విధాత: తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం 11 గంటలకు రాజ్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజాసేవలో మూడేళ్ల ప్రస్థానంపై పూస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తమిళి సై మాట్లాడుతూ.. ఎన్ని ఆంటకాలు వచ్చినా ముందుకే వెళ్తాను. సన్మానం జరిగినా.. జరగకపోయినా నా కృషిలో మార్పు ఉండదు. గౌరవం ఇవ్వనంత మాత్రానా.. నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
పేదల కోసం, వారి అభివృద్ధి కోసం కృషి చేస్తాను. కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నామని తెలిపారు. ఆదివాసీల కోసం 6 గ్రామాలు దత్తత తీసుకున్నాను. స్త్రీల సమస్యలు తగ్గించేందుకు మహిళా దర్బార్ నిర్వహించాం. 75 మంది మెరిట్ విద్యార్థులకు ఆగస్టు 15న బహుమతులు అందించామన్నారు.
విద్యార్థుల అవస్థలు, సమస్యలు గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశాను. వరద బాధిత ప్రాంతాలకు రెడ్ క్రాస్ ద్వారా సేవ చేశాం. పేద విద్యార్థులకు ల్యాప్ టాప్స్ అందించాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఉన్నదని , ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మలమైన మనసుతో ముందుకు సాగుతానని అన్నారు.
రాజ్‌భవన్ లో ఉన్నా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను. కొన్ని విషయాలు బైటికి చెప్పలేను. ప్రజల దగ్గరికి వెళ్లాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది ఎదురైంది. మూడేళ్లలో మహిళా గవర్నర్‌ను వివక్షకు గురిచేశారు.
‘‘రాజ్ భవన్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజ్ భవన్ విషయంలో ఇక్కడి అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లోనూ నన్ను పక్కన పెట్టారు. అందులో నాకేం బాధ లేదు. కానీ గవర్నర్ కార్యాలయానికి ఇవ్వాల్సిన మర్యాద ఇది కాదు. తెలంగాణ చరిత్ర పేజీల్లో ఆయా అంశాలు నిలిచిపోతాయి‘‘ అని తమిళిసై అన్నారు.