ఢిల్లీలో మెరువనున్న‌ ఖమ్మం జిల్లా గ్రానైట్‌

విధాత: తెలంగాణలోని ఖమ్మం జిల్లా గ్రానైట్‌ మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో మెరువనున్న‌ది. ఇప్పటికే నేషనల్‌ పోలీస్‌ మెమోరియల్‌, మాజీ ప్రధాని వాజ్‌పేయి సమాధిపై నిక్షిప్తమైన నల్లని గండుశిల ఇప్పుడు 28 అడుగుల నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహ రూపంలో దేశరాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఇండియాగేట్ వద్ద ఠీవిగా నిలబడనున్న‌ది. గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అద్వితీయపాత్ర పోషించిన ఈ మహనీయుడి సేవలను తరతరాలకు చాటి చెప్పేందుకు ఇండియాగేట్‌ వద్ద […]

  • Publish Date - September 8, 2022 / 06:07 AM IST

విధాత: తెలంగాణలోని ఖమ్మం జిల్లా గ్రానైట్‌ మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో మెరువనున్న‌ది. ఇప్పటికే నేషనల్‌ పోలీస్‌ మెమోరియల్‌, మాజీ ప్రధాని వాజ్‌పేయి సమాధిపై నిక్షిప్తమైన నల్లని గండుశిల ఇప్పుడు 28 అడుగుల నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహ రూపంలో దేశరాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఇండియాగేట్ వద్ద ఠీవిగా నిలబడనున్న‌ది. గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అద్వితీయపాత్ర పోషించిన ఈ మహనీయుడి సేవలను తరతరాలకు చాటి చెప్పేందుకు ఇండియాగేట్‌ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని ఈ ఏడాది జనవరిలో ప్రధాని ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. దీనికోసం 1,665 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా నుంచి 140 చక్రాలుగల 100 అడుగుల లారీలో 280 మెట్రిక్‌ టన్నుల ఏకశిల గ్రానైట్‌ రాయిని హ‌స్తిన‌కు తెప్పించారు.

సుమారు 26వేల గంటలు శ్రమించి కళాకారులు 65 మెట్రిక్‌ టన్నుల బరువున్న 28 అడుగుల విగ్రహానికి ప్రాణం పోశారు. కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత యువ కళాకారుడు అరుణ్‌ యోగిరాజ్‌ ఆధ్వర్యంలో ఆధునిక పరికరాలు ఉపయోగించి పూర్తి భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

ఇది దేశంలోని ఎత్తైన ఏకశిలా విగ్రహాల్లో ఒకటి. విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా మణిపురి శంఖ వాద్యం, కేరళ సంప్రదాయ పంచ వాద్యం, చండ మోగిస్తారు. ఏక్‌భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌ స్ఫూర్తితో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మంది కళాకారులతో కర్తవ్యపథ్‌లో నృత్యరూపకాలు ప్రదర్శిస్తారు.

ఇండియాగేటు వద్ద కొత్తగా నిర్మించిన యాంఫీ థియేటర్‌లో సుమారు 30 మంది కళాకారులు గిరిజన జానపద నృత్యాలను ప్రదర్శించనున్నారు. భారత తొలి స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంలో పద్మభూషణ్‌ పండిత్‌ శ్రీకృష్ణ రతన్‌జాన్‌కర్‌జీ రాసిన మంగళగానాన్ని పండిత్‌ సుహాష్‌వాషి ఆధ్వర్యంలోని గాయకులు, సంగీతకారులు ఆలపిస్తారు.

నేతాజీ విగ్రహావిష్కరణ నేపథ్యంలో 8, 9, 10, 11 తేదీల్లో పదినిమిషాల పాటు ఆయన జీవితానికి సంబంధించిన ప్రత్యేక డ్రోన్‌ షో ప్రదర్శిస్తారు.