విధాత: తనకు అత్యంత ఆప్త మిత్రుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు.
ప్రముఖ చలనచిత్ర నటుడు, మాజీ కేంద్రమంత్రి రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణం రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం ప్రకటించారు.
తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో హీరోగా, నటుడిగా వివిధ పాత్రలలో తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్నారని, కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని పేర్కొన్నారు.
లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముఖ్యమంత్రి KCR ఆదేశాల మేరకు అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుపనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా టిడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కృష్ణంరాజు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. సినీనటులు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూ. ఎన్టీఆర్,నాని, కల్యాణ్‌రామ్, మోహన్‌బాబు,విష్ణు తదితర సినీ హీరోలు, దర్శకులు, నిర్మాతలు కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళులర్పించారు.