విధాత: సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వత్రోత్సవాలను జయప్రదం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు గారు పిలుపునిచ్చారు. మంగళవారం అసెంబ్లీలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో జాతీయ సమైక్యత వజోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
వివిధ శాఖల సమన్వయంతో అత్యంత వైభవంగా వేడుక నిర్వహించాలని మంత్రి ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులకు సూచించారు. వజోత్సవాల విజయవంతానికి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికపుడు సమీక్ష చేసుకుంటూ మూడు రోజుల వేడుక పకడ్బందీగా నిర్వహించలన్నారు.
ఈనెల 16న తెలంగాణ జాతీయ సమైక్యత వజోత్సవాలు లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఆ రోజున నియోజకవర్గాల వారీగా 15 వేల మందితో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ర్యాలీలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, మహిళా సమాఖ్య ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు జాతీయ జెండాలతో పాల్గొనేలా చూడాలన్నారు. దీనికోసం 10 వేల చిన్న, 50 పెద్ద జెండాలు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం అక్కడే సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. వచ్చిన వారికి భోజనం వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
17 వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. అదే రోజున హైదరాబాద్ లో బంజారా భవన్, సేవాలాల్ భవన్ లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని, అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలకు అన్ని నియోజక వర్గాల నుంచి ప్రజలు తరలి వెళ్లేందుకు రవాణా, తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
18న జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందనీ, ఘనంగా నిర్వహించాల న్నారు. మొత్తంగా మూడ్రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో యావత్ ప్రజానీకం భాగస్తులు కావాలని.. వేడుకలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని, ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.