ఉన్నమాట: గవర్నర్ వ్యవస్థపై ఎప్పుడూ చర్చ జరుగుతున్నది. గవర్నర్ పేరు మీద పరిపాలన కొనసాగినా పరిపాలనలో వారి జోక్యం ఉండకూడదనేది ప్రజాప్రతినిధుల వాదన. ఇటీవల కాలంలో గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పాలన జోక్యం చేసుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలను బద్నాం చేసే కార్యక్రమాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ముఖ్యంగా బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు గవర్నర్ల జోక్యంపై బహిరంగంగానే విమర్శలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ జోక్యం ఎక్కువైందని, రాజ్‌భవన్ నుంచి పరిపాలించాలని చూస్తున్నారని, గవర్నర్‌ను జిల్లాల పర్యటనలకు పంపుతున్నారని, రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు ఉండవని వారు మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ ఆ వీడియోలను నెటీజన్లు షేర్ చేస్తున్నారు.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి, గవర్నర్ తమిళి సై మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మూడేళ్లు గవర్నర్‌గా పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టారు.
గవర్నర్ వ్యాఖ్యలపై అధికార పార్టీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు అంతే దీటుగా స్పందిస్తున్నారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడుతున్నారని, బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో గుజరాత్ సీఎంగా నాడు నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలనే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నాడు ఆయన చెప్పిన అభ్యంతరాలనే ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా గవర్నర్ వ్యాఖ్యలను తప్పుపట్టడం గమనార్హం.
హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నది. ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు సెక్షన్ 8 అంశాన్ని తెర మీదికి తెచ్చి గవర్నర్ హైదరాబాద్‌లో శాంతిభద్రతల విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు. నాటి గవర్నర్ నరసింహన్ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఎలా వ్యవహరించారో విధితమే. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆయన రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగానే మెలిగిన విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
కానీ ప్రస్తుత గవర్నర్ మాత్రం పాలనలో జోక్యం చేసుకుంటున్నారని, రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ.. శాంతిభద్రతల సమస్య సృష్టిస్తుంటే గవర్నర్ రాజకీయాలు మాట్లాడుతూ అగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరిస్తున్నారని మండి పడుతున్నారు. తెలంగాణ ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.