ఈ కోడిపుంజు కథ విన్నారా?

బస్సులో దొరికిన.. యజమాని ఎవరో తెలియని కోడి పుంజును రక్షిస్తున్న ఉదంతం కరీంనగర్‌ డిపోలో నవ్వులు పూయిస్తున్నది.

  • Publish Date - January 10, 2024 / 02:58 PM IST
  • కరీంనగర్‌ బస్‌ స్టేషన్‌లో రక్షిస్తున్న సిబ్బంది
  • యజమానికి అప్పగించేందుకు యత్నం


(విధాత బ్యూరో, కరీంనగర్)

ఆర్టీసీ సిబ్బంది ఆ కోడిపుంజును శ్రద్ధగా చూసుకుంటున్నారు. అయితే అదేదో సంక్రాంతికి వచ్చే కోడిపందాల కోసం అనుకుంటే పొరపాటే. దాని యజమాని ఎవరో కనిపెట్టి.. భద్రంగా ఆ అయ్య చేతిలో ఈ కోడిని పెట్టి.. తమ బాధ్యతను తీర్చుకునేందుకే! కోడి ఏంటి.. దానిని యజమానికి అప్పగించడమేంటి? కోసి కూరొండుకోక! అంటారా? అది కుదరకే వారు దీన్ని కాపాడుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే..


వరంగల్ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఈ కోడిపుంజు ప్రత్యక్షమైంది. కరీంనగర్ బస్ స్టేషన్‌లో బస్సు దిగుతున్న ప్రయాణికుడికి పక్క సీట్లో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగు కనిపించింది. దీంతో ఆయన విధి నిర్వహణలో ఉన్న కంట్రోలర్‌కు సమాచారం అందించారు. దీంతో ఆ బ్యాగును స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ సిబ్బంది దానిని విప్పి చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ బ్యాగులో పకడ్బందీగా ప్యాక్ చేసిన కోడిపుంజు దర్శనం ఇవ్వడమే వారి ఆశ్చర్యానికి కారణం. కోడిపుంజు ఎవరిదో? దానికోసం ఎవరు వస్తారో? వారికి స్వాధీనం చేయాల్సిన అవసరం ఉన్నందున బస్ స్టేషన్ సిబ్బంది దానిని రెండవ డిపోకు తరలించి అక్కడ భద్రపరిచారు.


ఇక అసలు సమస్య ఇక్కడే ప్రారంభం అయింది. దానిని సంరక్షించే బాధ్యత రెండవ డిపో సిబ్బందిపై పడింది. అటు డిపో నిర్వహణ చూసుకోవడం, ఇటు కోడి సంరక్షణ పర్యవేక్షించడం వారి విధుల్లో భాగంగా మారిపోయింది. ఆర్టీసీ బస్సుల్లో ఇలా జంతువులు, కోళ్లు తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. ఒకవేళ ఉన్నా, దానికి టికెట్ తప్పనిసరి. కనుక రహస్యంగా బ్యాగులో ఈ కోడిపుంజు తీసుకువచ్చిన ప్రయాణికుడు జరిమానా చెల్లించక తప్పదు. జరిమానాకు భయపడి ఆయన కోడిపుంజు కోసం వస్తాడో, రాడో తెలియని పరిస్థితి.


అలాగని దానిని రక్షించకుండా వదిలేయలేని దుస్థితి. దీంతో సరైన ఆధారాలతో కోడిపుంజు కోసం వచ్చే ప్రయాణికుడి కోసం ఎదురుచూస్తున్న ఆర్టీసీ సిబ్బంది, దానికి మేత వేస్తూ, కంటికి రెప్పలా కాపాడుతున్నారు. డిపోలో విధులకు వచ్చే కండక్టర్లు, డ్రైవర్లకు ఈ కోడిపుంజు చతురోక్తులకు కారణం అవుతోంది. దాన్ని తమకు ఇస్తే ఓ పూట పండగ అయినా చేసుకునే వాళ్లమంటూ సిబ్బంది హాస్యోక్తులు విసురుతున్నారు. కోడీ.. జాగ్రత్త!