మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి ఖరారు

విధాత, నల్లగొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ప్రకటన విడుదల చేశారు. మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి, పున్నకైలాష్, పాల్వాయి స్రవంతిలు పోటీపడగా పార్టీ అధిష్టానం స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. స్రవంతి దివంగత […]

  • Publish Date - September 9, 2022 / 07:31 AM IST

విధాత, నల్లగొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ప్రకటన విడుదల చేశారు. మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి, పున్నకైలాష్, పాల్వాయి స్రవంతిలు పోటీపడగా పార్టీ అధిష్టానం స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.

స్రవంతి దివంగత రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి 1967లో 1972, 1978, 1983, 1999ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఐదు సార్లు గోవర్ధన్ రెడ్డి మునుగోడు సాధన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు.

2007లో ఏపీ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై 2009 వరకు కొనసాగారు. 2012 సంవత్సరంలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై పదవిలో ఉండగానే 2017 జూన్ 9న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి ప్రాంతంలో జరిగిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన సందర్భంలో గుండెపోటుకు గురై మృతి చెందారు.

గోవర్ధన్ రెడ్డి మరణాంతరం వచ్చిన తెలంగాణ అసెంబ్లీ 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన పాల్వాయి స్రవంతికి కాంగ్రెస్, సీపీఐ పొత్తు నేపథ్యంలో పార్టీ టికెట్ దక్కలేదు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 27,441 ఓట్లుతో రెండో స్థానంలో నిలిచింది.

ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. తదుపరి 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి పార్టీ టికెట్ దక్కించుకోవడంతో ఆమెకు మరోసారి నిరాశ ఎదురయింది.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అయితే రాజగోపాల్ రెడ్డి మరో 18 నెలల ఎమ్మెల్యేగా పదవీకాలం ఉండగానే రాజీనామా చేసి బీజేపీలో చేరిపోవడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ పాల్వాయి స్రవంతి దక్కించుకున్నప్పటికీ ఆమె త్రిముఖ పోటీలో టీఆర్ఎస్, బీజేపీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటుంది.

ఇప్పటికే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకవైపు, టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా వలసలు ప్రోత్సహించడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ గణనీయంగా బలహీన పడింది.

ఈ నేపథ్యంలో మూడో ప్రయత్నంలో పార్టీ టికెట్ సాధించిన స్రవంతి త్రిముఖ పోటీలో విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఇదే సమయంలో తనతో పాటు పార్టీ టికెట్ ఆశించి భంగపడిన పార్టీ నాయకులను కూడా ఆమె కలుపుకొని పోవాల్సివుండటం కూడా ఆమెకు తక్షణ సవాల్ గా ముందుంది.