విధాత:తెలుగు భాష. తేనెలొలుకు తేట తెలుగు భాష. అమ్మ బాష. మనందరి భాష. అలాంటి తెలుగు భాషను తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో చిన్నచూపు చూస్తున్నారు. చదువు నేర్వడానికి పనికిరాదంటూ పక్కన పెట్టేశారు. పసిపిల్లల దశ నుంచే తెలుగును దూరం చేసేస్తున్నారు. పరాయి రాష్ట్రంలో, పరభాష ముఖ్యమంత్రి మాత్రం మన తెలుగును అందలం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
దేశ భాషలందు తెలుగు లెస్సా.. అనే స్పూర్తితో తెలుగు భాషకి.. కేంద్ర ప్రభుత్వ అధికార భాష హోదా లభించే విధంగా కృషి చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించడం సంచలనంగా మారింది. కేవలం తెలుగు అనే కాదు.. భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో పేర్కొన్న భాషలన్నిటికీ.. అధికార భాష హోదా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు సీఎం స్టాలిన్. అంటే, తమిళనాడులో తమిళంతో పాటు తెలుగుకూ పెద్దపీట వేసేందుకు కృషి చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం అభినందనీయం. తెలుగు వారందరికీ గర్వకారణం.
సీఎం పీఠం అధిరోహించనప్పటి నుంచీ స్టాలిన్ ఇలా పలు జనరంజక నిర్ణయాలు తీసుకున్నారు.
తమిళులు సైతం తెలుగులో మాట్లాడటానికి చాలా ఇష్టపడతారు. చాలామంది తమిళులకు తెలుగు బాగా వచ్చు. మాజీ సీఎం జయలలిత తెలుగు భాషలో ప్రావీణురాలు. తమిళనాడులో సెటిల్ అయిన తెలుగువారంతా తెలుగు మీడియంలో విద్యాభ్యాసం చేయడానికే ఇష్టపడతారు. తమిళనాడులోనూ ఇప్పటికీ తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయంటే నమ్మాల్సిందే. అరవ రాష్ట్రంలోనే తెలుగుకు అంత ఆదరణ ఉంటే.. మన ఏపీలో మాత్రం భాషనూ రాజకీయం చేస్తూ.. తెలుగు ఉనికినే ప్రశ్నార్థకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాటల్లో చెప్పాలంటే.. పరాయి భాష కళ్లద్దాలు లాంటిది.. మాతృభాష కళ్లు. కళ్లుంటేనే కదా కళ్లద్దాలు పెట్టుకునేది..!