ఈ ఏడాది అత్యంత వేడి! వచ్చే ఏడాది జనాలకు చుక్కలే

  • యూరప్‌ క్లైమేట్‌ సంస్థ హెచ్చరిక
  • సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలి
  • వాతావరణ నిపుణుల సూచన

ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం, దానిని కట్టడి చేయడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోని కారణంగా వాతావరణం తీవ్ర దుష్పరిణామాలకు కారణమవుతున్నది. ఈ క్రమంలోనే 2023.. అత్యంత వేడి సంవత్సరంగా ముగియనున్నదని తాజాగా ఒక నివేదిక పేర్కొన్నది.


అంతేకాదు.. రాబోయే ఏడాది ఈ రికార్డును సైతం అధిగమిస్తుందని హెచ్చరించింది. మరోవైపు 2023 గడిచిన 83 ఏళ్లలో అంటే 1940 తర్వాత అత్యంత వేడి నెలగా సెప్టెంబర్‌ నిలిచిందని తెలిపింది. 2023 సెప్టెంబర్‌ ప్ర‌పంచ స‌గ‌టు ఉష్ణోగ్ర‌త 0.52 ఎక్కువ‌గా న‌మోద‌యిన‌ట్టు యూరోపియ‌న్ యూనియ‌న్ కోప‌ర్నిక‌స్‌ క్లైమేట్ చేంజ్ స‌ర్వీస్‌ వెల్ల‌డించింది.


ఈ ఏడాది ప్ర‌పంచ స‌గ‌టు ఉష్ణోగ్ర‌త పారిశ్రామిక విప్ల‌వ‌కాలానికి ముందు కంటే 1.4 సెల్సియ‌స్‌లు ఎక్కువ‌గా న‌మోద‌యిన‌ట్టు ఆ సంస్థ తెలిపింది. వాతావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి అత్యంత అవ‌స‌ర‌మైన స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ద‌ని చెప్పాల్సిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఇది అని కోప‌ర్నిక‌స్ స‌ర్వీసు డిప్యూటీ డైరెక్ట‌ర్ తెలిపారు.


ఇప్పటి వరకూ 2023లో జూలై, ఆగస్టు నెలలు అత్యంత వేడి నెలలుగా రికార్డయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా వేడిగాలులు, కార్చిచ్చులు దీనికి కారణమని సంస్థ పేర్కొన్నది. ఇప్పుడు వాటిని సెప్టెంబర్‌ అధిగమించింది. మొత్తంగా 2023 అత్యంత వేడి ఏడాదిగా నిలిచింది. అయితే.. ఎల్‌ నినో పరిస్థితులు క్రమంగా పుంజుకుంటున్న కారణంగా వచ్చే ఏడాది ఈ రికార్డు కూడా బద్దలవుతుందని కొర్నికస్‌ సంస్థ హెచ్చరించింది.

Latest News