విధాత, నల్గొండ: మునుగోడులో గుభాళించేది గులాబీ జెండాయేనని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. ఇప్పటికే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమైందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలంలోని కొండూరు గ్రామ ఉప సర్పంచ్ పాలకుర్ల జంగయ్య గౌడ్, గ్రామపంచాయతీ సభ్యులు ఎండీ జహంగీర్, పగడాల రాములు, ఏ.రాంబాబు, ఉడుగు శ్రీనులతో పాటు వారి అనుచరులు శనివారం ఉదయం హైదరాబాద్‌లో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమన్నారు. టీఆర్ఎస్‌లో రోజురోజుకు పెరుగుతున్న వలసలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం మీద పెరిగిన విశ్వసనీయతకు అద్దం పడుతుందన్నారు.
కమలం పార్టీకీ తెలంగాణలో స్పేస్ లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదని గల్లీలో రాదని ఆయన పేర్కొన్నారు. అటువంటి పార్టీల పరిస్థితులు గమనించిన మీదటే టీఆర్ఎస్‌లోకి వలసల పర్వం కోనసాగుతుందన్నారు.
కార్యక్రమంలో చందంపేట మాజీ ఎంపీపీపి గోవింద్, గ్రామ సర్పంచ్ కుంభం నర్సమ్మ , మాజీ సర్పంచ్, ఉడుగు ఆంజనమ్మ, గ్రామశాఖ అధ్యక్షుడు వల్లపు సైదులు, సీనియర్ నాయకులు బండి యాదయ్య, కొప్పుల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మంత్రిని శాలువాలతో సత్కరించారు.