పెళ్లిళ్లు దేశంలోనే చేసుకోండని ప్రధాని అన్నది ఇందుకే!

దేశంలోని టాప్‌ 5 వ్యాపారాల్లో ఒకటిగా పెళ్లిళ్ల బిజినెస్‌ తయారైంది. కనీసం 8 లక్షల నుంచి మూడు కోట్ల వరకు ఖర్చు చేసేవారూ ఉన్నారట.

  • Publish Date - December 17, 2023 / 11:24 AM IST
  • ఈ ఏడాది పెళ్లిళ్ల బిజినెస్‌ 4.74 లక్షల కోట్లు!
  • దేశంలో అతిపెద్ద వ్యాపారంగా వివాహాలు
  • బ్యాండ్‌బాజా.. లక్షల కోట్ల బిజినెస్‌

న్యూఢిల్లీ : ఒకసారి అలా అలా జ్ఞాపకాల్లోకి 30 ఏళ్ల వెనక్కి వెళ్లిపోండి.. అప్పట్లో పెళ్లంటే ఇంటి ముందు పెద్ద పందిరి వేసి చేసేది. ఊళ్లో అందరినీ పెళ్లికి పిలిచేది. ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌లు లేవు.. మెహందీలు లేవు.. సంగీత్‌లూ గట్రా కూడా తెలియదు! ప్రీవెడ్డింగ్‌ షూట్‌ల ముచ్చటే లేదు. అయినా.. ఘనంగానే జరిగేవి. కానీ.. ఇప్పుడు పెళ్లిళ్ల తీరుతెన్నులు మారిపోయాయి. ఓ మేరకు తాహతు ఉన్నవారైతే.. భారీ ఫంక్షన్‌ హాళ్లలో చేసేదే పెళ్లి అన్నట్టు మారిపోయింది. పెళ్లికి ముందే బోలెడు కార్యక్రమాలు! మెహందీ, సంగీత్‌, బ్యాచ్‌లర్‌ పార్టీలు.. ఆఖరుకు పెళ్లి కూతురును చేసే సందర్భం కూడా పెద్ద ఉత్సవమే! ఇవన్నీ కలిపి.. దేశంలో వివాహాలను అతి ఖరీదైన వ్యాపారాల్లో ఒకటిగా మార్చివేశాయి. మరికొద్ది రోజుల్లో ముగియబోతున్న 2023 సంవత్సరంలో పెళ్లిళ్ల వ్యాపారం 4.74 లక్షల కోట్లు అంటే నమ్మగలమా? పెళ్లిళ్ల సీజన్‌ అంటే ప్రతి ఒక్కరూ అలర్ట్‌ అయిపోతారు. ఆఖరుకు ఇటీవల రాజస్థాన్‌ ఎన్నికల్లో పోలింగ్‌ తేదీని పెళ్లిళ్ల సీజన్‌కు భయపడి మార్చుకోవాల్సి వచ్చింది. సాధారణంగా హిందూ క్యాలెండర్‌లో ఈ ఏడాది నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 15 మధ్య శుభదినాలు ఉన్నాయి. వచ్చే ఏడాదికి సంబంధించి పెళ్లి ముహూర్తాలు జనవరి 14 నుంచి ప్రారంభమై జూలై చివరి వరకు కొనసాగుతాయని పండితులు చెబుతున్నారు.


భారీ వ్యాపారంగా వివాహాలు

గత రెండు దశాబ్దాల క్రితంతో పోల్చితే.. ఇప్పుడు దేశంలో వివాహాలు భారీ వ్యాపారంగా మారిపోయాయి. ఎగువ మధ్యతరగతివర్గాల ఆదాయం, వినిమయ శక్తి పెరుగదలతో పెళ్లిళ్లు ఆడంబరంగా చేస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. పెళ్లిని జీవితకాలం గుర్తుంచుకునే ఒక మధుర ఘట్టంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనేక రకాల వ్యాపారాలు, వృత్తులు పెళ్లిళ్ల వ్యాపారంలో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. ఫలితంగా దేశంలోని ఐదు పెద్ద వ్యాపారాల్లో వివాహాలు కూడా ఒకటిగా నిలిచాయి. మొత్తంగా ఈ ఏడాది 4.74 లక్షల కోట్ల మేరకు పెళ్లిళ్ల పేరిట బిజినెస్‌ జరుగుతుందని కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) చెబుతున్నది. 4.74 లక్షల కోట్లంటే.. దాదాపు 12 దేశాల జీడీపీతో సమానం.


అనేక రంగాల కలయిక

పెళ్లిళ్లలో పెళ్లిని ఏ పద్ధతిలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్లాన్‌ చేసేవారు మొదలుకుని.. పెళ్లి మండపం అలంకరణ, పెళ్లి ముందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణ, కిరాణా, అలంకరణ సామగ్రి, పూజాసామగ్రి, దుస్తులు, నగలు, ఫొటోగ్రఫీ.. ఇలా ఒకటేమిటి అనేక రంగాలు ఇందులో నిమగ్నమవుతున్నాయి. కనీసం ఎనిమిది లక్షల నుంచి గరిష్ఠంగా మూడు కోట్ల వరకూ ఖర్చుతో తాము పెళ్లికి ఏర్పాట్లు చేయగలమని ముంబైకి చెందిన వెడ్డింగ్‌ ప్లానర్స్‌ చెబుతున్నారు. పెళ్లి బడ్జెట్‌లో నగలు, దుస్తులు పక్కనపెడితే.. ప్రధానంగా భోజనాలు, మండపం అలంకరణ, ఫొటోగ్రఫీ, మేకప్‌ ఆర్టిస్టుల ఖర్చు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.


వెడ్డింగ్‌ డెస్టినేషన్ల వెనుక..

ఈ ఖర్చు తట్టుకోలేక కొందరు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయి.. కొద్దిమందితో పెళ్లి వేడుకలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. పెళ్లి కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టగలిగినప్పుడు ఇక్కడే ఎందుకు.. ఏ థాయ్‌లాండో మరో చోటికో వెళ్లి ఎందుకు చేసుకోకూడదు? అనే ఆలోచనలు కూడా వస్తున్నాయట. అందుకే డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ పెరుగుతున్నాయని ఈ రంగంలోని వారు చెబుతున్నారు. ఇప్పుడు అర్థమైందా.. ప్రధాని మోదీ తన మన్‌ కీ బాత్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ వద్దు.. ఇండియాలోనే పెళ్లిళ్లు చేసుకోండి.. అని సూచన చేసింది!